Wednesday, April 17, 2024

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో మార్పుకోసం పాటుపడాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజంలో అసమానతలు తొలగించేందుకు విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అందరికీ అందించాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రముఖుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సాహూ మహారాజులు ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానమంత్రిగా, రాజకీయవేత్తగా దేశంలో పెనుమార్పులకు నాంది పలికారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. రిజర్వేషన్ ద్వారా రాజ్యాంగ హక్కులు పొందిన ప్రతి ఒక్కరూ సమాజంలో పీడిత వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమాజంలో అందరూ సమానంగా ఉండేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి చేశారని, సమాజం జాగృతి అయినప్పుడే, ఐక్యమైనప్పుడే ఇది సాధ్యమవుతాయని, రాజకీయాలకు ఆతీతంగా సమాజంలో మార్పు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల ఉచిత ఆర్ధిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. దీన్ని ఎవరు ఆపలేరన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టలేదని, కానీ దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాదులో ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం జరిగిందని, ఇది తమ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఘనతగా పేర్కొన్నారు. హిందీ పేపర్ లీక్ చేసిన బీజేపీ నాయకుడు వెంటనే ఆ పార్టీ అధ్యక్షునికి పేపర్ ను పంపించడం, ఆయన వెంటనే మీడియాకు సమాచారం అందించడం కుట్రలో భాగమేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ నిజంగా పేపర్ లీక్ అయి ఉంటే పోలీసులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలి కానీ బీజేపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షునికి పంపించి పేపర్ లీక్ అయిందంటూ మీడియా వాళ్లకు సమాచారం అందించడం దీన్ని రాధాంతం చేయడం వెనక కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, సాంఘీక సంక్షేమ శాఖ ఇంచార్జి డిడి పాండు, మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు, జిల్లా గొర్రె కాపురుల సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ కు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement