Saturday, March 23, 2024

మామూళ్ల మత్తులో అధికారులు.. కోట్ల రూపాయల మట్టి అక్రమ రవాణా

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్నా మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గోరంత అనుమతి పొంది కొండంత తవ్వకాలు జరుపుతున్న చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి మండలం లోని రాఘవాపూర్ చెరువులో 76,400 టన్నుల మట్టి ఇటుకల తయారీ కోసం రాయల్టీ కట్టి ఇప్పటికే ఏడు లక్షల టన్నులకు పైగా మట్టి తరలించారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటుకల తయారీ కోసం అనుమతి పొంది మట్టి ఇటుక బట్టీలు తరలించాల్సి ఉంది. కానీ చెరువు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో చెరువు మట్టి ని గుట్టలుగా నింపినా అధికారుల కళ్ళకు మాత్రం కానరావడం లేదు. ఇటుక బట్టీలు స్థాపించిన నాటి నుండి ఒక చెరువు లో ఇంత పెద్ద మొత్తంలో మట్టిని తీయడం తాము గత 20 సంవత్సరాలుగా ఎన్నడూ చూడలేదని ఇటుక బట్టి యజమానులే పేర్కొనడం విశేషం.

రోజూ వందలాది లారీల తోపాటు వందలాది ట్రాక్టర్ల లో ఇప్పటికే ఏడు లక్షల టన్నుల కు పైగా మట్టి ని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులో మట్టి పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ సూచించిన మార్గదర్శకాలను తుంగలోతొక్కి మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఓవర్ లోడ్ తో పాటు రాత్రిపూట మట్టిని తరలిస్తున్నా రవాణా శాఖ సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం ఎంతమేర మామూలు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం. గల్లీ నుండి జిల్లా వరకు ప్రజాప్రతినిధులకు స్థాయిని బట్టి మట్టి మాఫియా జేబులు నింపిందని, ఖద్దరు చొక్కా వేసుకున్న అధికార, ప్రతిపక్ష నాయకులకు సైతం పెద్ద ఎత్తున మామూళ్లు ముట్ట చెప్పారని సమాచారం. రాఘవపూర్ చెరువు సమీపంలో పొలాల్లో గుట్టలుగుట్టలుగా మట్టి నిల్వ ఉంచినా చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మట్టి అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement