Thursday, March 28, 2024

15-18లోపు విద్యార్థులంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవాలి : సబితా ఇంద్రారెడ్డి

15-18 సంవ‌త్స‌రాల్లోపు విద్యార్థులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ ను తీసుకోవాల‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రంగారెడ్డి జిల్లా చిన్నారుల వ్యాక్సిన్ ప్రక్రియకు విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి శ్రీకారం చుట్టారు. బాలపూర్ యూపిహెచ్సి లో 25 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన వెయిటింగ్ హాల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ….. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుండి చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. 15 సంవత్సరాల నుండి 18 ఏళ్ల లోపు 22 లక్షల 78 వేల 683 మందికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 6 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య శాఖ చిన్నారులకు వ్యాక్సిన్ వేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల 35 వేల మందిని గుర్తించామని, వారందరికీ వ్యాక్సిన్ వేసి వంద శాతం 15 నుండి 18 ఏళ్ళ లోపు వారికి వ్యాక్సిన్ వేసి జిల్లా ముందు వరుసలో ఉండాలన్నారు. ఈ వయసులో ఉండే పాఠశాల, కళాశాల విద్యార్థుల వ్యాక్సిన్ కోసం ఆయా విద్యాలయాలు చొరవ చూపాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. 18 ఏళ్ల పైబడిన వారు కూడా మిగిలి ఉంటే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. భౌతిక దూరం తో పాటు, మాస్క్ లు పెట్టుకోవటం, చేతులు కడుక్కోవటం, శానిటేషన్ తదితర వాటిని విస్మరించవద్దన్నారు. కోవిడ్ వివిధ వేరియంట్ ల దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందన్నారు. మొదటి డోసును 114 శాతం పూర్తి చేసిన రంగారెడ్డి వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా నష్టపోయామని, విద్యా రంగం పై కూడా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. మన రాష్ట్రంలో కోవిడ్ వల్ల ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అన్ని ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున బెడ్ లు ఇతర సదుపాయాలు సిద్దంగా ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి, కార్పొరేటర్లు, వైద్య అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement