Saturday, April 20, 2024

భ‌ద్రాద్రి రామ‌య్య క‌ల్యాణానికి ఏర్పాట్లు పూర్తి..

భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 30న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి శ్రీరామ దివ్యక్షేత్రం ముస్తాబైంది. స్వామి వారి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈ నెల 30న సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉండటంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా .2020 నుండి 2022 వరకు స్వామి కల్యాణాన్ని రామాలయానికే పరిమితం చేశారు. మూడేళ్ళ తరువాత మిథిలా కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

భక్తుల కోసం 200క్వింటాలతో తయారు చేసిన ముత్యాల తలంబ్రాలను సిద్దం చేశారు. 2లక్షల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని సిద్దం చేశారు. కల్యాణానికి హాజరయ్యే భక్తుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ అందించనున్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులను కనువిందు చేసే విధంగా జిల్లాలోని ప్రధాన కూడళ్ళలో భారీ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, బస వసతి కోసం షామియానాలను ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ డా.వినీత్‌ ఆధ్వర్యంలో 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement