Thursday, April 18, 2024

ఖమ్మం గుమ్మం – స‌ర్వ సిద్ధం..

హైదరాబాద్‌/ఖమ్మం, ఆంధ్రప్రభ: జాతీయ రాజకీయాల్లో కొత్త శకం మొదలవనుంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారం భించిన టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహించే తొలి బహిరంగసభకు ఖమ్మం వేదిక అవనుంది. బుధవారం జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లి, పంజాబ్‌, కేరళ రాష్ట్రాల సీఎంలు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై పోరాటానికి సమర భేరి మోగిస్తూనే ఈ ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లిd ఎన్నికలకు ఈ సభా వేదిక నుంచి కేసీఆర్‌ శంఖారావం పూరించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు భిన్నంగా జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ కార్యాచరణ ఎలా ఉండనుందనేది కేసీఆర్‌ తన ప్రసంగంలో వివరిరంచనున్నారు. సభకు 5 లక్షల మందికి తక్కువ కాకుండా ప్రజలు హాజరయ్యేందుకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరిపి కసరత్తు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కాకుండా పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేటకు చెందిన పార్టీ నాయకులు, వామపక్షాల నేతలు సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యేందుకు వారి వారి ప్రయత్నాలు చేశారు. జిల్లా కొత్త కలెక్టరేట్‌ పరిసరాల్లోని 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో సర్వం సిద్ధం చేశారు.

హైదరాబాద్‌కు చేరుకున్న అతిథులు… నేడు యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శనం…
సభకు అతిథులుగా విచ్చేస్తున్న ఢిల్లి, కేరళ, పంజాబ్‌ సీఎంలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వేరువేరుగా చేరుకున్నారు. వీరిని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డిలు స్వాగతం పలికారు. ముఖ్య అతిథులంతా బుధవారం ఉదయం హైదరాబాద్‌ లోని ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో కలిసి అల్పాహారం చేస్తారు. వీరంతా ఈ అల్పాహార భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్లలో తొలుత యాదాద్రి వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఖమ్మం సభకు బయలుదేరనున్నారు.

కొత్త కలెక్టరేట్‌… కంటివెలుగు ప్రారంభం తర్వాత సభా వేదికపైకి…
ఖమ్మంలో కంటివెలుగు రెండో విడత, కొత్త ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత అతిథులతో కలిసి భోజనం చేసి అనంతరం సభావేదికపైకి విచ్చేసి తొలుత అతిథులు ప్రసంగించిన అనంతరం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. స్వాతంత్రానంతరం రెండు జాతీయ పార్టీల పాలనలో దేశం ఏ విధంగా వెనుకబడిందో వివరిస్తూ, దేశాభివృద్ధికి బీఆర్‌ఎస్‌కు ఉన్న విజన్‌ను సీఎం తన ప్రసంగంలో ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సభ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అనంతరం కేసీఆర్‌తో కలిసి అతిథులంతా తిరిగి హైదరాబాద్‌ చేరుకుని వారి ప్రాంతాలకు పయనమవుతారు.

ఖమ్మం చరిత్రలోనే భారీ బహిరంగ సభ
తెలంగాణ రాజకీయాల్లోనే ఖమ్మం చరిత్రలో బీఆర్‌ఎస్‌ తొలి సభ కనీవిని ఎరుగని రీతిలో జరగనున్నట్లు తెలుస్తోంది. 5 లక్షల దాకా జనాలు హాజరయ్యే ఈ తరహా సభ జిల్లా చరిత్రలోనే ఇప్పటివరకు జరగలేదు. సభ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలు నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, పొరుగున ఉన్న ఆంధ్రా సరిహ ద్దు ప్రాంతాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. కొత్త కలెక్టరేట్‌ వద్ద సభ కోసం వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్‌కు 440 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభలో వేయి మంది వాలంటీర్లు పాల్గొన నున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని, వేదిక ముందు భాగంలో ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్షన్‌లో వేల సంఖ్యలో సీటింగ్‌ ఏర్పాటు చేశారు.

- Advertisement -

సభా వేదికపై ఆశీనులయ్యేది వీరే…
బీఆర్‌ఎస్‌ సభా వేదికపై జాతీయ అతిథులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మాత్రమే సీఎం కేసీఆర్‌తో సభా వేదికపై ఉంటారు. మిగతా మంత్రులు, నాయకులు సభా వేదికకు ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీట్లలో ఆసీనులవు తారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు సభా వేదికపై కూర్చునేవారి జాబితాలో ఢిల్లిd సీఎం కేజ్రీవాల్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌, బీఆర్కేఎస్‌ అధినేత గుర్నం సింగ్‌, సీనియర్‌ జర్నలిస్టు వినీత్‌ నారాయణ్‌, మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మల్లారెడ్డి, సబిత, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement