Wednesday, April 17, 2024

Big Story: వరిపైనే గురి, వానాకాలంలో సాగు తగ్గించేలా ప్రణాళిక.. పత్తి, కంది పెంచాలని నిర్ణయం!

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : ఎండకాలంలో వరి సాగు గణనీయంగా తగ్గింది…ధాన్యం కొనుగోలు ఇబ్బందిగా ఉంటుందని ఇతర పంటలు సాగు చేయాలని పెద్దఎత్తున ఊరూరు తిరిగి రైతులకు అవగాహన కల్పించారు…నీటి వసతులు ఉన్న రైతులు కూడా వరి సాగు చేసేందుకు వెనకడుగు వేశారు….వానాకాలంలో కూడా అలాగే చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వానాకాలం సాగులో కూడా వరి సాగును సగానికి తగ్గించేలా వానాకాలం ప్రణాళిక రూపొందించారు. వానాకాలంలో ఎక్కువమంది రైతులు వరి వైపే మొగ్గు చూపుతారు…వర్షాలు కరువడంతో పంట ఎండిపోయే పరిస్థితులు ఉండవు. దీంతో చాలామంది రైతులు వరి సాగు చేసేందుకే మొగ్గు చూపుతారు…కానీ ప్రభుత్వం వరి సాగును తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది…మొత్తం మీద వానాకాలంలో కూడా వరి సాగును తగ్గించి ఇతర పంటల సాగును పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది. పత్తి సాగును మాత్రం గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలను రైతులు ఎంతమేర అమలు చేస్తారనేది ఆలోచించాల్సిన విషయం…

రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేవు. భారీగా వర్షాలు కురిస్తేనే బోరు బావుల్లోకి నీళ్లు చేరతాయి. గత మూడేళ్లుగా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నందునా ప్రతిఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది వానాకాలంలో అన్ని రకాల పంటలు 3.79లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి 4.88లక్షల ఎకరాల వరకు అన్ని రకాల పంటలు సాగవుతాయని అంచనా వేసింది. దానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందించే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌లను లెక్కించి ఇంకా ఎంతమేర ఎరువులు, విత్తనాలు కావాలనే దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతసారి మాదిరిగానే ఈసారి కూడా పుష్కలంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తొలకరి పలకరించగానే విత్తనాలు విత్తడం ప్రారంభిస్తారు రైతులు. వర్షాలు ప్రారంభమయ్యే సరికి కావల్సిన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో వ్యవసాయ శాఖ నిగమ్నమైంది.

వరి సాగు విస్తీర్ణం తగ్గించేలా….

జిల్లాలో వరి సాగుకు పెట్టింది పేరు… వానాకాలంతోపాటు రబీ సీజన్‌లో కూడా ఎక్కువమంది రైతులు వరి సాగు చేస్తారు. అందులో నీటి వసతులు ఉన్న రైతులు ఎక్కువ శాతం వరి వైపే మొగ్గు చూపుతారు. గత రబీ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం చాలావరకు తగ్గింది. రబీలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో చాలామంది రైతులు వరి సాగు చేయలేదు. ప్రభుత్వం కూడా వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులతో ఊరూరా రైతులకు అవగాహన కల్పించారు. గతసారి రబీ సీజన్‌లో జిల్లాలో లక్ష ఎకరాలకు పైగానే వరి సాగుచేశారు. ఈసారి రబీ సీజన్‌లో సాగు విస్తీర్ణం సాగానికి తగ్గింది. 47వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. రబీ సీజన్‌ మాదిరిగానే ఈసారి వానాకాలంలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే వానాకాలం పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రకటించింది.

జిల్లాలో గత వానాకాలంలో 1.30.430 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఈసారి దానిని ఏకంగా 75వేల ఎకరాలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. వానాకాలంలో మెజార్టీ రైతులు వరి సాగు చేస్తారు. నీటి వసతులు ఉండటం…ఆశించినమేర వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మెజార్టీ రైతులు వరి వైపే మొగ్గు చూపుతారు. రబీ సీజన్‌ మాదిరిగానే వానాకాలంలో కూడా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించేలా ప్రణాళిక రూపొందించారు. రబీ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించేందుకు కారణం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం సేకరణలో నువ్వా నేనా అనే పంచాయతీ ఉండటంతో సాగు చేస్తే ఎవరు కొనుగోలు చేస్తారనే అనుమానంతో చాలామంది రైతులు వరి సాగు చేయలేదు. నీటి వసతులు ఉన్న రైతులు కూడా వరి నాట్లు వేయలేదు. కేంద్రం వెనక్కి తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం రబీలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. దీంతో సాగు చేయని రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వానాకాలంలో సాధ్యమైనంత వరకు వరి సాగును తగ్గించేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. రైతులు ఎంతమేర అమలు చేస్తారనేది వేచి చూడాలి..

- Advertisement -

పత్తి..కంది సాగు విస్తీర్ణం పెంచేలా….

గిట్టుబాటు ధర వచ్చే పంటలు సాగు చేసేలా ఈసారి వానాకాలం సాగులో రైతులకు అవగాహన కల్పించబోతున్నారు. అందులో భాగంగానే పత్తి, కంది సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు తీసుకోబోతున్నారు. జిల్లాలో పత్తి సాగుకు పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈసారి వానాకాలంలో 2.75లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగయ్యేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోనుంది. గతసారి వానాకాలంలో జిల్లాలో 1.31లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. ఈసారి మాత్రం సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయబోతున్నారు. చేవెళ్ల, కందుకూరు, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తారు. ఈసారి రెట్టింపు స్థాయిలో సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. పత్తి సాగుతో లాభాలు ఉండటంతో దీనివైపు రైతులు మొగ్గుచూపేలా చర్యలు తీసుకోనున్నారు.

నల్లరేగడి, ఎర్ర భూముల్లో ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. తొలకరి జల్లులు కురిసిన వెంటనే పత్తి విత్తనాలు నాటుతారు. అప్పుడే విత్తనాలు కూడా రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తితోపాటు కంది సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచేలా చర్యలు తీసుకోబోతున్నారు. జిల్లాలో గత వానకాలంలో 35,571 ఎకరాల విస్తీర్ణంలో కంది సాగు చేశారు. ఈసారి 70,520ఎకరాలకు పెంచేలా వానాకాలం ప్రణాళిక రూపొందించారు. గతసారితో పోలిస్తే సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. జొన్న పంట సాగును కూడా పెంచేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. గతసారి జిల్లాలో కేవలం 4209 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే జొన్న పంట సాగు చేశారు. ఈసారి సాగు విస్తీర్ణాన్ని 15వేల ఎకరాలకు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తం మీద రైతులకు లాభాలు వచ్చే పంటలు సాగు చేసేలా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. గతసారి పోలిస్తే ఈసారి వానాకాలం సాగుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. 2022-23 సంవత్సరానికి వానాకాలంలో 4.88లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. గతఏడాది మాత్రం 3.79 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. గతసారి కంటే ఈసారి లక్ష ఎకరాలకు పైగానే సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement