Thursday, March 28, 2024

పట్టపగలే దొంగతనం..

కాసిపేట: పట్టపగలే కార్మిక కాలనీలో జరుగుతున్న దొంగతనాలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ సంఘటన మర్చిపోక ముందే గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడటం కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది. మందమర్రి ఏరియా సోమగూడెం భరత్‌కాలనీలో నివాసం ఉంటూ కాసిపేట గనిలో విధులు నిర్వహిస్తున్న బండి సత్తయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలియజేసిన కథనం ప్రకారం సొంత పనులపై సత్తయ్య దంపతులు మంచిర్యాలకు వెళ్లగా, ఇంట్లో ఉన్న వారి కుమారుడు రాజ్‌కుమార్‌ వేరే పని మీద బయటకు వెళ్లినట్లు తెలిపారు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన రాజ్‌కుమార్‌ ఇంటి తలుపు తీసి చూడగా ఇంటి వెనుకాల సైతం తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. దీంతో ఇంట్లోని పరిసరాలను పరిశీలించగా బీరువా పగలగొట్టి ఉండటం, వస్తూవులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గమనించి ఇంటి వెనుకకు వెళ్లి పరిశీలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో రాజ్‌కుమార్‌ అతన్ని వెంబడించాడు. కొంత దూరం రాజ్‌కుమార్‌ అతన్ని వెంబడించగా చోరీకి పాల్పడిన వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు. రాజ్‌కుమార్‌ ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు సమాచారం అందించగా బీరువాలో పెట్టిన సుమారు 8 తులాల బంగారు నగలు, రూ.60వేల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలనీలో ఇది రెండవ సంఘటన : గత జనవరిలో జరిగిన చోరీ సంఘటన మర్చిపోక ముందే 2వ సంఘటన చోటుచేసుకుంది. అంజయ్య అనే పండ్ల వ్యాపారీ ఇంట్లో లేని సమయంలో పట్టపగలు ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి అందులో పెట్టిన 4 తులాల బంగారు నగలు, 20వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకుపోయారు. పట్టపగలే ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగతనాలకు పాల్పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రీయ రహదారిని ఆనుకొని పోలీస్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ దొంగలు బరితెగించి చోరీలకు పాల్పడుతుండటం, ఇంట్లో విలువైన వస్తువులు, నగదును దోచుకువెళ్తుండటంపై ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏమైనా కొద్దిరోజుల్లోనే పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతుండటం కాలనీవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా శనివారం చోరీ జరిగిన ఇంటిని బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌ పరిశీలించగా, చోరీ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు జాగిలాలతో విచారణ వేగవంతంగా జరిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement