Tuesday, April 16, 2024

KBR Park: ఆ రోజు జరిగింది ఇదీ.. దాడి ఘటన వివరించిన నటి

హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్‌లో నటి షాలు చౌరాసియాపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది. చౌరాసియాపై దాడి చేసింది ఒక సైకో అని పోలీసులు గుర్తించారు. దుండగుడి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై నటి చౌరాసియా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించారు.

తాను గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం వేళ వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్‌కు వెళ్తున్నానని చెప్పారు. ఈ నెల 14న వాకింగ్ కు వెళ్లానని, రాత్రి 8 గంటల సమయంలో తిరిగి పార్క్ చేసిన కారు వద్దకు వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తనపై దాడిచేశాడని తెలిపారు. తన రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ అరవడంతో తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని తెలిపారు. తన వద్ద నగదు లేదని, నంబరు చెబితే ఫోన్‌ పే చేస్తానని చెప్పానని, అతడు నంబరు చెప్పేందుకు తడబడడంతో తాను 100కు డయల్ చేసేందుకు ప్రయత్నించానన్నారు. గమనించిన అతడు తన ఫోన్ లాక్కుని పక్కనే ఉన్న బండరాయిపైకి తోసి తన తలను బలంగా బాదాడని, దీంతో స్పృహ కోల్పోయినట్టు చెప్పారు. దుండగుడు తనపై లైంగిక దాడికి యత్నించినట్టు చెప్పారు. అదే సమయంలో స్పృహ రావడంతో ప్రతిఘటించినట్టు తెలిపారు. దీంతో అతడు తనపై బండరాయి విసిరాడని, దాని నుంచి తప్పించుకున్నట్టు పేర్కొన్నారు. దుండగుడు తనను చంపి నిప్పు పెడతానని బెదిరించాడని, తను అతి కష్టం మీద పార్క్ ఫెన్సింగ్ ఎక్కి దూకి తప్పించుకున్నట్టు నటి షాలు చౌరాసియా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement