Thursday, April 25, 2024

వంగర గ్రామాన్ని సందర్శించిన సాహితీవేత్తల బృందం


కాళోజి నారాయణరావు పురస్కార గ్రహీత డా‌.నలిమెల భాస్కర్ రావుతో కూడిన కరీంనగర్ కు చెందిన సాహితీ వేత్తల బృందం శనివారం మధ్యాహ్నం వంగర గ్రామంలో పి.వి.నరసింహారావు మ్యూజియాన్ని సందర్శించారు. కాళోజి నారాయణరావు వర్థంతి సందర్భంగా కాళోజి పౌండేషన్ హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాళోజి పురస్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, కరీంనగర్ కు చెందిన సాహితీవేత్త, బహుబాషా కోవిదుడు డా.భాస్కర్ రావు ఈ పురస్కారం అందుకున్నారు. తిరుగు ప్రయాణంలో హనుమకొండ కేంద్రానికి 30కిలోమీటర్ల దూరంలో వున్న పి.వి.స్వగ్రామాన్ని సందర్శించి మ్యూజియంలో పి.వి.కి చెందిన వస్తువులు, వివిధ హోదాల్లో అనేకమందితో కూడిన ఫొటో గ్యాలరీ సందర్శించి తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా కాళోజి పురస్కార గ్రహీత డా.భాస్కర్ రావు మాట్లాడుతూ.. వంగర గ్రామాన్ని ప్రపంచ పటంలో చూపిన ఘనత పి.వీ.దే నని అభిప్రాయపడ్డారు. తన పరపాలనా దక్షతతో భారతదేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపచేశారని, పి.వి.తరువాత ఏర్పడిన ప్రభత్వాలు ఆయన అవలంబించిన ఆర్థిక విధానాన్ని అవలంబిస్తున్నాయని తెలిపారు. మ్యూజియం ఇన్ ఛార్జ్ విష్ణుదాసు లక్ష్మీకాంత్ బృందానికి మ్యూజియం ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో టీయూడ‌బ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, కవులు అన్నవరం, దేవేందర్, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, సి.వి.కుమార్, పెనుగొండ బసవేశ్వర్ వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement