Wednesday, April 24, 2024

700ఏళ్లుగా దేదీప్య‌మానంగా వెలుగుతున్న‌ – అఖండ దీపం

ఓ ఆల‌యంలో సుమారు 700ఏళ్లుగా దేదీప్య‌మానంగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. కరీంనగర్‌ గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న సీతారామస్వామి ఆలయాన్ని 1314లో కాకతీయుల చివరి రాజైన ప్రతాప రుద్రుడు ఈ ఆల‌యాన్ని నిర్మించినట్లు అక్కడి శిలాశాసనాన్ని బట్టి తెలుస్తోంది. అంతటి ప్రాచీన ఆలయంలో ఉన్న నంద దీపమే ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గుడి నిర్మాణ సమయంలో వెలిగించిన నంద దీపం అప్పటి నుంచి ఇప్పటివరకూ వెలుగుతూ ఉంది. దాని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని స్థానికులు నమ్ముతుంటారు. ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉండటానికి అప్పటి రాజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఆ కాలంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కొంత డబ్బును దీపానికి నూనె కోసం సమకూర్చేవారట. అయితే రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత గ్రామంలోని దాతలే నూనెను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం గంభీరావుపేటకు చెందిన అయిత రాములు, ప్రమీల దంపతులు తాము జీవించి ఉన్నంతకాలం నూనెను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి చారిత్రక నేపధ్యం కలిగిన ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. సీతారాముల కళ్యాణం సమయంలో ఆలయంతో పాటు నంద దీపాన్ని చూసేందుకే వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపాన్ని 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో నిర్మించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement