Thursday, April 25, 2024

Telangana: విద్యార్థుల పెండిగ్‌ ఫీజులు 3,300 కోట్లు విడుదల చేయాలి.. ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ తదితర కాలేజీ కోర్సులు చదవి 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి గత రెండేళ్ల ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌ను రెండు రెట్లు పెంచాలని కోరారు. ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం తెలుగు సంక్షేమ భవన్‌ ముందు దాదాపు 4 వేల మంది విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్‌ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కాలేజీల యజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆయన వివరించారు. ముందుగా ఫీజులు కట్టాలని, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక తిరిగి వాపస్‌ ఇస్తామని చెబుతున్నారని ఆయన తెలిపారు. ఫీజులు చెల్లించని వారిని క్లాస్‌ రూమ్‌లకు రానీయడం లేదని, దీని మూలంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. విద్యతో పేద కులాలు రాజ్యాధికారానికి వస్తారనే భయం ప్రభుత్వానికి పట్టుకున్నదని ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు కాలేజీ విద్యార్థులకు రూ. 1500 నుంచి రూ. 3 వేలు, పాఠశాల విద్యార్థులకు రూ. 100 నుంచి రూ. 2 వేల వరకు పెంచాలన్నారు.

బీసీల జనాభా మేరకు అదనంగా మరో 120 గురుకులాలు, 50 డిగ్రీ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 300 కాలేజీ హాస్టళ్లు కొత్తగా ప్రారంభించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఐఐటీ, ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా అమలు చేయాలని, బీసీ స్టడీ సర్కిల్‌ బడ్జెట్‌ రూ. 200 కోట్లకు పెంచాలని, రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, జూనియర్‌ అడ్వకేట్స్‌కు నెలకు రూ. 10 వేల స్టయిఫండ్‌ ఇవ్వాలన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల వెంకటేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, నాయకులు లాల్‌ కృష్ణ, చంటి ముదిరాజ్‌, అనంతయ్య, నర్సింహగౌడ్‌, నికిల్‌, దీపిక, భాస్కర్‌ ప్రజాపతి, ఉదయ్‌, మల్లేష్‌ యాదవ్‌, బోయ అరవింద్‌, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement