Sunday, April 14, 2024

షర్మిల పోరు బాట.. నిరుద్యోగం, రైతు సమస్యలపై ఫోకస్!

ఖమ్మం వేదికగా తెలంగాణ‌లో రాజ‌కీయ‌ ప్రస్థానాన్ని ప్రారంభించిన వైఎస్ షర్మిల.. ఇక ప్రజా సమస్యలపై గురి పెట్టారు. జూలై 8న పార్టీని ప్రారంభించ‌నున్న వైఎస్ ష‌ర్మిల.. తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడతాన‌ని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తానని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగా ఆమె నిరాహార దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ నెల 15 నుంచి హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష చేస్తున్నట్లు ఆమె అనుచరులు వెల్లడించారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల ఆమె దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఖమ్మంలో సభలోనూ ఆమె టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా దీక్ష సిద్దమైయ్యారు.  షర్మిల దీక్ష చేసిన‌ప్ప‌టికీ ప్రభుత్వం స్పందించకుంటే.. ఇత‌ర‌ జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆమె అనుచ‌రులు చెప్పారు. తెలంగాణ‌లో లక్షా 91 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ల‌ను ఇచ్చే వ‌ర‌కు నిరుద్యోగుల త‌ర‌ఫున పోరాటం కొన‌సాగుతుంద‌ని స్పష్టం చేశారు.

కాగా, ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థులు, రైతుల ఆత్మహత్యలు, రైతులకు జరిగిన అన్యాయం గురించి షర్మిల ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ప్రభుత్వ తీరు దున్నపోతుపై వాన పడ్డట్టుగానే ఉందని.. అందుకే రాజకీయ పార్టీ స్థాపిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. రాజన్న హాయంలో ఉన్న స్వర్ణయుగం ఇప్పుడు లేదని, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మొత్తం అవినీతి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది.. ఏమైంది కేసీఆర్ సారూ.. అంటూ షర్మిల ప్రశ్నించారు.

నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలు ఆగిపోవాలని మరో చావు కబురు కూడా మన చెవిన పడకముందే కేసీఆర్ ప్రభుత్వం నిద్ర లేవాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని అన్నారు. నిరుద్యోగులకు తాము భరోసా కల్పించేందుకు, కేసీఆర్‌ను నిద్ర లేపేందుకు ఏప్రిల్ 15 నుంచి తాము నిరాహార దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement