Tuesday, April 16, 2024

Spl Story | అంతరిక్షంలో డెస్టినేషన్​ వెడ్డింగ్​​.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు మాత్రమే!

పెళ్లిళ్ల సీజన్​ స్టార్ట్​ అయ్యింది. ఈ ఏడాది మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. పెళ్లి అనగానే.. పందిళ్లు, రంగు కాగితాల తోరణాలు, వాకిట్లో ముగ్గులు, ఇంటినిండా చుట్టాల సందడి యాదికొస్తుంది కదూ.. కానీ, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఫంక్షన్​ హాళ్లు, డీజే సౌండ్స్​ మోత మోగుతోంది. ఇక పట్టణాలు, సిటీలలో మధ్యతరగతి కుటుంబాల తీరు కాస్త డిఫరెంట్​గా ఉంటోంది. సంపన్న కుటుంలు అయితే డెస్టినేషన్​ వెడ్డింగ్​ పేరిట కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇది కాస్త పీక్స్​ చేరి ఇప్పుడు డెస్టినేషన్​ వెడ్డింగ్​కి వేరే లెవల్​లో ప్లాన్​ చేస్తోంది ఓ సంస్థ. స్పేస్​లో మ్యారేజీ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

అంతరిక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎలా ఉంటుంది? ఈ విషయం ఆలోచించాలంటేనే అంతుపట్టడం లేదు కదా.. అయితే.. ఇది కొంతమంది సంపన్నులకు అందుబాటులోకి త్వరలోనే సాధ్యం కాబోతోంది. వచ్చే ఏడాది నిర్వహించే డెస్టినేషన్​ వెడ్డింగ్​ కోసం ఇప్పటి నుంచే బుకింగ్స్​ కూడా స్టార్ట్​ అయ్యాయి. ఇందులో ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి పైగానే స్లాట్​ బుక్​ చేసుకున్నారు. కాగా, ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌తో అనుభూతులను నెక్ట్స్​ లెవల్​కి తీసుకెళ్లవచ్చు అంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.

మీ ప్రియమైన వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం ద్వారా వారిని ఆశ్చర్యపరచవచ్చని చెబుతున్నారు. ఈ వేడుక నమ్మశక్యం కాకుండా ఉంటుందని, ఎంతో మధురానుభూతిని అందిస్తుందని చెబుతున్నారు. భూమి నుంచి కోటి అడుగుల ఎత్తులో.. ప్రాపంచిక సమస్యల నుండి తప్పించుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందని గొప్పగా చెబుతున్నారు. కాగా, ఇక్కడ దీన్ని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని, ఈ మహోత్సవం కోసం ఒక్కొక్కరికి భారత కరెన్సీలో ఒక కోటి రూపాయలు మాత్రమే చెల్లించాలని ఆ సంస్థ తెలియజేస్తోంది.

- Advertisement -

స్పేస్ పెర్స్పెక్టివ్ అనేది ఈ ప్రత్యేకమైన ఏర్పాటును ప్రకటించిన సంస్థ. ఇది పెళ్లి చేసుకోబోయే జంటలను కార్బన్-న్యూట్రల్ బెలూన్‌లో కక్ష్యలోకి పంపడం ద్వారా వారికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించనుంది. ఇది భూమికి సంబంధించిన వ్యూని అత్యంత ఎత్తు నుంచి చూడ్డానికి వీలు కల్పించనుంది. చుట్టూ గ్లాస్​ విండోస్​తో ఈ క్యాప్సూల్​ ఏర్పాటు చేయనున్నారు. ఆ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది 6 గంటల స్పేస్‌షిప్ నెప్ట్యూన్ ఫ్లైట్​గా ఉండబోతోంది. దీనిలో జర్నీ చేసేవారిని భూమి నుండి దాదాపు 1,00,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత వారిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొస్తారు.

2024లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ సంస్థ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే 1,000 టిక్కెట్లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యొక్క SpaceBalloon విభాగం అంతరిక్ష నౌక నెప్ట్యూన్‌ను కక్ష్యలోకి ప్రవేశపెడుతుందని తెలిపారు. ఇది రాకెట్లను ఉపయోగించకుండా పునరుత్పాదక హైడ్రోజన్ ద్వారా ముందుకు సాగుతుంది. ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్​లో తెలిపిన ప్రకారం.. ఈ విమానంలో వెళ్లే వారు పూర్తిగా ఆనందించగలరు. వారు కాక్‌టెయిల్‌ని ఎంజాయ్​ చేయొచ్చు. తోటి ప్రయాణికులతో చిట్​ చాట్​ చేయొచ్చు. క్యాప్సూల్‌లో పూర్తి-సన్నద్ధమైన రెస్ట్ రూమ్ కూడా ఉంటుందని వెబ్‌సైట్​లో తెలిపారు. అంతేకాకుండా వారి బంధుఏవులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్​ చేసుకోవడానికి అత్యధిక వేగంగల Wi-Fi  కనెక్షన్ కూడా ఉంటుందని వెల్లడించారు.

బుకింగ్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి..

https://spaceperspective.com/

https://spaceperspective.com/

Advertisement

తాజా వార్తలు

Advertisement