Saturday, April 20, 2024

తిరుపతిలో భారీ విజయం దిశగా వైసీపీ అభ్యర్థి

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్ట్ బ్యాలెట్ల నుంచి లీడ్‌లో ఉన్న గురుమూర్తి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై వైసీపీ అభ్యర్థి గురుమూర్తి దాదాపు లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లు లెక్కిస్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లు కౌంట్ చేస్తున్నారు.

ఇప్పటివరకు 2,29,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి 56 శాతానికి పైగా ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 32.5 శాతం, బీజేపీ అభ్యర్థికి 5.7 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘనవిజయం ఖరారు కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్య‌ర్థి అభ్యర్థి పనబాక లక్ష్మీ రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. దీంతో అసంతృప్తితో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె వెళ్లిపోయినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారాన్ని ప‌న‌బాక లక్ష్మీ ఖండించారు. అటువంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. అయితే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితం కూడా అందుకు త‌గ్గ‌ట్లు ఉండేవ‌ని చెప్పారు. ఫలితాల గురించి ముందే తెలిసి కూడా అక్కడ జ‌రుగుతున్న‌ తమాషా చూద్దామనే కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద‌కు వ‌చ్చాన‌ని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement