Saturday, April 20, 2024

ఆరు నెల‌లు బాగా కష్టపడండి, జాబ్​ కొట్టేందుకు ఫోకస్​ పెట్టండి.. ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు కేటీఆర్ సూచ‌న‌

తెలంగాణలో ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్య‌ర్థుల‌కు మంత్రి కేటీఆర్ కొన్ని ముఖ్య సూచ‌న‌లు చేశారు. ఆరు నెలలపాటు ఎంటర్​టైన్​మెంట్​కు దూరంగా ఉండాలని, సినిమాలు, షికార్లు వంటివి లేకుండా బాగా కష్టపడి చదవాలని సూచించారు. అంతేకాకుండా క్రికెట్ వంటివి కూడా తక్కువగా చూడాలని, ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల‌ను బంద్ చేసి చ‌దువుపై ఫుల్​ ఫోకస్​ పెట్టాలని కోరారు. ఫోన్ త‌క్కువ‌గా వాడితేనే లాభం ఉంటుంది. మీ త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టే విధంగా భ‌విష్య‌త్‌కు ప్ర‌ణాళికలు వేసుకోవాల‌ని ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. పీర్జాదిగూడ ప‌రిధిలో మంత్రి మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ఇవ్వాల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ‘‘మ‌ల్లారెడ్డి మాట్లాడిన త‌ర్వాత మాట్లాడుట క‌ష్టం. మిమ్మ‌ల్ని ఒక ఊపు ఊపి విడిచి పెట్టారు. అసెంబ్లీలో కూడా అంతే. మ‌న‌సుకు ఎక్కే విధంగా మాట్లాడిండు. ఆయ‌న కూడా యూతే కాబ‌ట్టి ఆ విధంగా మాట్లాడారు”అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఘ‌న‌త మ‌ల్లారెడ్డికే ద‌క్కుతోంది..
నిన్న కాక మొన్న శాస‌న‌స‌భ‌లో 90 వేల ఉద్యోగాల‌కు సంబంధించి సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో మొద‌టిసారిగా ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన ఘ‌న‌త మ‌ల్లారెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. కోచింగ్ సెంట‌ర్‌లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయ‌న్నారు. 3 నుంచి 4 నెల‌ల పాటు ఈ కోచింగ్ సెంట‌ర్ కొన‌సాగుతుంది. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్లాసులు కొన‌సాగుతాయి. మ‌ధ్యాహ్న భోజ‌నంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వ‌నున్నారు. ఒక లైబ్ర‌రీని ఏర్పాటు చేయాల‌ని నిర్వాహ‌కుల‌కు కేటీఆర్ సూచించారు.

టీ శాట్ చానెల్స్‌ను ఉప‌యోగించుకోవాలి..
రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో కొవిడ్ కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య‌, నిపుణ చానెల్‌ను ప్రారంభించామ‌ని కేటీఆర్ తెలిపారు. యూట్యూబ్‌లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో ల‌భ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ చానెల్‌ను వాడుకోవాల‌ని సూచిస్తున్నాను. మీ కోసమే ప్ర‌భుత్వం ఇన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు తీసుకుంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ప్రైవేటు రంగంలోనూ వేల సంఖ్య‌లో ఉద్యోగావకాశాలు..
ఒక్కో ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప‌దుల సంఖ్య‌లో పోటీ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పోటీత‌త్వంతో గ‌ట్టిగా చ‌దివితే ఉద్యోగం వ‌స్త‌దనే విశ్వాసం వ‌స్తుంది. ఒక వేళ ఉద్యోగం రాక‌పోయినా బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. టీఎస్ ఐపాస్ ద్వారా 19వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. 13 వేల ప‌రిశ్ర‌మ‌లు ప‌నులు ప్రారంభించాయి. మ‌రో 6 వేల ప‌రిశ్ర‌మలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు రంగంలో కూడా వేల సంఖ్య‌లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాం. తెలంగాణ పిల్ల‌ల‌కు కొలువులు ఇచ్చిన‌ట్లు అయితే ప్రోత్సాహ‌కాలు ఇస్తున్నామ‌ని తెలిపారు. ప్రైవేటు రంగంలో క‌చ్చితంగా మ‌న పిల్ల‌ల‌కే ఎక్కువ చాన్సెస్​ వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. టీ హ‌బ్, వీ హ‌బ్ లాంటి సంస్థ‌ల్లో కూడా పారిశ్రామిక ఔత్సాహికుల‌కు ప్రోత్సాహ‌కాలు క‌ల్పిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అవ‌స‌రం..
15 ల‌క్ష‌ల 62 వేల ఉద్యోగాలు కేంద్ర ప్ర‌భుత్వ రంగంలో ఉన్నాయి. వాళ్లు కూడా నింప‌క త‌ప్ప‌దు. దాంట్లో మ‌న‌కు కూడా 60నుంచి 70 వేల ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. చ‌ద‌వ‌డం వ‌ల్ల న‌ష్టం ఉండ‌దు. ఏదో ఒక రోజు ఉద్యోగం వ‌స్తుంది. నైపుణ్య శిక్ష‌ణ(స్కిల్) పొందాలి. అప్ స్కిల్ చేసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు రీ స్కిల్ చేసుకోవాలి. ఈ నినాదాన్ని ప్ర‌తి ఒక్క‌రూ అందిపుచ్చుకోవాలి. ప్ర‌పంచంతో పోటీ ప‌డే పౌరులుగా మీరు త‌యారు కావాలి. టాస్క్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ కూడా ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌పంచంలో మారుతున్న ప‌రిణామాల‌కు అనుగుణంగా మ‌న‌కు మ‌నం ఆవిష్క‌రించుకోవాలి. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు రంగంలో వ‌చ్చే ఉద్యోగాల‌కు పోటీ ప‌డుతూనే ఇత‌ర అంశాల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement