Tuesday, April 23, 2024

‘కూతురి చదువు కోసం కిడ్నీలు అమ్ముకుంటాం!’

కుమార్తె చదువు కోసం ఆ తల్లి తల్లడిల్లుతోంది. డాక్టర్‌ కావాలన్న తమ స్వప్నం చెదిరిపోతుందేమోననే క్షణక్షణం కుమిలిపోతోంది.  తన కుమార్తె చదువు కోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయింది ఆ తల్లి. కూతురి పరీక్ష ఫీజు కట్టేందుకు డబ్బుల్లేక కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు మొరపెట్టుకున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం ఆజాద్‌నగర్‌లో మక్బుల్‌ జాన్‌, అయూబ్‌ ఖాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె రుబియా ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌ లోకి వెళ్లింది. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో కూతురిని 16 నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ పంపించారు. ప్రస్తుతం కుమార్తె వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. అయితే, విదేశీ విద్యకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పథకం అమలుకాకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది ఏర్పడింది. దీంతో మక్బుల్‌ జాన్‌ గత రెండు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది.

ఈ విషయమై గతంలో హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర దీక్ష కూడా చేశారు. దీంతో న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో అప్పట్లో దీక్ష విరమించారు. కానీ, ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, రుబియా పరీక్షలు రాయాలంటే ఈ నెల 17వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ, అధికారుల నుంచి ఉపకార వేతనం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో ప్రభుత్వ సాయం అందకపోతే.. తమ కిడ్నీలు అమ్ముకుని కూతురు ఫీజు చెల్లించుకుంటానని మక్బుల్ జాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని భర్తతో కలిసి మక్బుల్‌ జాన్‌ సోమవారం  అనంతపురం వచ్చి కలెక్టర్‌ గంధం చంద్రుడుకు అర్జీ పెట్టుకున్నారు. అధికారులు స్పందించి.. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని.. లేకుంటే కనీసం తమ కుమార్తె విద్య కోసం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

తన కుమార్తెను ఎలాగైనా డాక్టర్‌ చేయాలనుకుంది మక్బుల్‌ జాన్‌. వెంటనే విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకుంది. అలాగే పట్టణంలో ఉన్న సిండికేట్‌ బ్యాంకులో విద్యారుణం కోసం బ్యాంకు మేనేజర్‌ను కోరింది. ఆ సమయంలో బ్యాంకు మేనేజర్‌ విద్యారుణం అందిస్తామని…. అయితే కళాశాలలో చేరినట్లు అడ్మిషన్‌ కార్డు, కళాశాల ఫీజు వివరాలను అందించాలని సూచించారు. దీంతో ఆమె బయట రూ. 3 లక్షలు అప్పు చేసి ఎంబీబీఎస్ చదువు కోసం గతేడాది విదేశాలకు పంపింది. కళాశాలలో చేరి అక్కడి నుంచి బ్యాంకుకు అవసరమైన అన్ని పత్రాలను తీసుకొచ్చి బ్యాంకు అధికారులకు అందించింది. ఇంతలోనే కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది.

మార్చిలో కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఆ తల్లి చేస్తున్న వ్యాపారం దెబ్బతింది. దీంతో వ్యాపారం కోసం తీసుకున్న రుణ వాయిదాలను ఆ తల్లి చెల్లించలేకోపోయింది. దీంతో బ్యాంక్‌ వాళ్లు పాత రుణం తీర్చలేదు కాబట్టి ఆమె బిడ్డకు విద్యరుణం ఇవ్వలేమని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న విదేశీ విద్యా దీవెన పథకం రద్దు అయ్యింది. దీంతో ఇటు బ్యాంకు రుణం అందక, అటు ప్రభుత్వ సహాయం లేక మగ్‌బుల్‌జాన్‌ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement