Saturday, April 20, 2024

ఈ సారైనా అన్నాచెలెళ్లు కలుస్తారా?

గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న అన్నాచెల్లెలు ఏపీ సీఎం జగన్‌, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇద్దరూ బుధవారం సాయంత్రానికి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకోనున్నారు. గురువారం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి నేపథ్యంలో వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తండ్రికి నివాళులర్పించేందుకు సీఎం జగన్‌, షర్మిలలు ఇడుపులపాయకు చేరుకుంటారు. అయితే, ఇద్దరూ కూడా విడివిడిగానే ఈ కార్యక్రమంలో పాల్గొంటారా?లేక తమ తండ్రికి కలిసే నివాళులర్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

జూలై 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన జగన్‌, షర్మిల.. ఇద్దరూ ఎవరికి వారే అన్నట్లు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల వెళ్లిన తర్వాత జగన్ అక్కిడి రావడంతో వీరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు బహిర్గతం అయ్యాయని ప్రచారం జరిగింది. ఇక, ఈసారి షర్మిల, తల్లి విజయలక్ష్మి కలిసి బుధవారం ఇడుపులపాయకు చేరుకుంటారు. గురువారం ఉదయం 8-10 గంటల మధ్య వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

మరోవైపు సీఎం జగన్ కూడా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. గురువారం ఉదయం 9 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించి, 12:45 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

ఇడుపులపాయకు ఒకే రోజు చేరుకుంటున్న అన్నాచెల్లెలు జగన్‌, షర్మిల ఇరువురూ వైఎస్సార్‌ ఎస్టేట్‌లో బస చేయనున్నారు. ఎస్టేట్‌లోకి వెళ్లేందుకు ఒకే మార్గం ఉన్నా.. ఎస్టేట్‌ లోపల వేర్వేరుగా రెండు భారీ భవంతులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో బంగ్లాలో బస చేస్తారని సమాచారం. వేర్వేరు బంగ్లాల్లో ఉన్నా చాలా నెలల తర్వాత అన్నాచెల్లెలు ఒకే సమయంలో, ఒకే ప్రాంగణంలో కలుస్తుండడంతో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారా? లేదంటే ఎవరికి వారే వైఎస్సార్‌ వర్ధంతిలో పాల్గొని వెళ్తారా? అన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

మరోవైపు వైఎస్సార్‌ ఆత్మీయ సమ్మేళనానికి జగన్‌ తల్లి విజయలక్ష్మి ఏపీకి చెందిన నాయకులకు ఆహ్వానం పంపారు. అయితే, అదే రోజు సీఎం జగన్‌ ఇడుపులపాయలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. జస్టిస్ పీఎస్ నరసింహ!

Advertisement

తాజా వార్తలు

Advertisement