Friday, April 19, 2024

జూన్‌లో బడులకు కొత్త సార్లు వ‌చ్చేనా.. వేసవి సెలవుల్లో ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించిన విద్యాశాఖ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అంతా అయోమయంగా మారింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎప్పుడు విడుదల చేస్తరో అనే దానిపై స్పష్టత కరువైంది. జూన్‌లోగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇంకా బడులు పున:ప్రారంభం కావడానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఈలోపు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయి పాఠశాలలకు కొత్త సార్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? అనే అనుమానాలను ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న వివిధ కోర్టు కేసులు అడ్డంకిగా మారాయని విద్యాశాఖ అంటోంది. ఈ నేపథ్యంలోనే ఈప్రక్రియను చేపట్టేందుకు ముందుకుపోలేని పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ విడుదలకు ముందే ప్రస్తుతం ఉన్న కోర్టు కేసులను వెనక్కితీసుకునేలా, షెడ్యూల్‌ తర్వాత కొత్త చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది.

అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు దఫాలుగా భేటీ అయి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జోన్ల విధానం మారడంతో కొత్త సర్వీసు రూల్స్‌ రూపొందించాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలు, మేనేజ్‌మెంట్ల వారీగా టీచర్ల సీనియారిటీ జాబితా రూపొందించాలి. ఇవి పూర్తయిన తర్వాత పదోన్నతులు, బదిలీలపై మార్గదర్శకాలను విడుదల చేసి షెడ్యూల్‌ ప్రకటిస్తారు. ఇది జరగాలంటే కోర్టులో ఉన్న పెండింగ్‌ కేసులు ఓ కొలిక్కి రావాల్సిందేనని పాఠశాల విద్యాశాఖలోని పలువురు అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితిలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏడేళ్ల నుంచి ఎదురుచూపులే…

పదోన్నతుల కోసం టీచర్లు దాదాపు ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. దాంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 26,050 సర్కారు బడుల్లో దాదాపు 1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. సుమారు రెండు సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారు ప్రమోషన్లు, బదిలీలకు అర్హులు. 2015లో చివరిసారిగా ప్రమోషన్లు చేపట్టారు. 2018లో బదిలీలు చేపట్టారు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రమోషన్లు, నాలుగేళ్ల నుంచి బదిలీలు ఇంత వరకూ చేపట్టలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జూన్‌ 13న బడుల ప్రారంభానికి ముందే టీచర్లకు బదిలీలు చేపట్టి ప్రమోషన్లు కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రతీ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు వరుసగా వినతి పత్రాలు అందిస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు.

స్పెషల్‌ పర్మిషన్‌ తెచ్చుకుంటారా?…

- Advertisement -

ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ల పోస్టులను 10వేలకు పెంచుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 5,812 పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. మరోవైపు లాంగ్వేజ్‌ పండిట్‌, పీఈటీల అప్‌గ్రేడ్‌పై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. వచ్చే నెల జూన్‌ 17కు లాంగ్వేజీ పండిట్ల కేసు విచారణకు రానుంది. అప్పటి వరకు ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టడానికి వీళ్లేదని తెలుస్తోంది. ఈక్రమంలో హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకుంటేగానీ, ఉన్న కోసులన్నీ ఒక్క సారిగా పరిష్కారమైతే గానీ ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టడానికి అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement