Thursday, March 28, 2024

జగన్‌ను ఉండవల్లి ఎందుకు రెచ్చగొడుతున్నారు?

ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి రెండు రోజుల కిందట మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు అవుతుందని బీజేపీ నేత సునీల్ డియోధర్ చేసిన వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందిస్తూ.. జగన్‌‌ను మళ్లీ జైలుకు పంపేంత ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడాల్సిన అసవరం లేదని ఉండవల్లి అన్నారు. ‘పోతే జైలుకు పోతారు. జైలు ఏమైనా కొత్తనా నీకు.. జైలుకెళ్లు.. జైల్లోనే ఉండి పరిపాలించు.. అంతే గాని, భయపడటం దేనికి?’అని జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

అయితే ఉండవల్లి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒకవేళ నిజంగానే బీజేపీ ధైర్యం చేసి జగన్ బెయిల్‌ను రద్దు చేస్తే.. ఏపీలో జరిగే కీలక పరిణామాలను ఉద్దేశించే ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే భయపడకుండా జైలు నుంచే సీఎం హోదాలో పాలించాలని ఉండవల్లి హితవు పలికారని తెలుస్తోంది. ఇప్పటికే విభజన కారణంగా ఎంతో నష్టపోయిన ఏపీలో పరిపాలనను అస్తవ్యస్తం చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, అందుకే ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఉండవల్లి ముందస్తుగా మానసికంగా సిద్ధంగా ఉండేందుకు జగన్‌ను రెచ్చగొడుతున్నారని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.

అటు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 51 శాతం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు భయపడాలని ఉండవల్లి ప్రశ్నించడం కూడా వైసీపీ చేతకానితనాన్ని తెరపైకి తెస్తున్నట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేకహోదా అంశంపై పోరాడటంలో టీడీపీ సర్కారు తరహాలో వైసీపీ సర్కారు కూడా విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. 22 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేకహోదాపై జగన్ కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆరోపణలు వస్తున్న తరుణంలో జగన్ మేల్కొని కేంద్రంపై ధైర్యంగా పోరాడాలని ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు దేశంలో బీజేపీ అన్ని సంస్థలతో పాటు ఏపీకి గుండెకాయ వంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా జగన్ వెనకడుగు వేస్తే… నిజంగానే తప్పు చేసినట్లు జనం భావిస్తారని ఉండవల్లి జగన్‌ను రెచ్చగొడుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే పార్లమెంట్ వేదికగా కేంద్రంపై పోరాడాలని ఉండవల్లి సూచించారని.. విశాఖలో సెమినార్ పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ ఇద్దాం అంటూ ఉండవల్లి పిలుపునిచ్చారని టాక్ వినపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement