Saturday, April 20, 2024

బిర్యానీ ఫెస్టివల్​లో బీఫ్ ఎందుకు పెట్ట‌లే.. కలెక్టర్‌ను నిలదీసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

బిర్యానీ ఫెస్టివల్‌లో బీఫ్‌ను తొలగించడం వివాదస్పదమైంది. దీంతో జిల్లా కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నిలదీసింది. ఈ వివక్షపై వివరణ ఇవ్వాలని కోరింది. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 12 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ‘అంబూర్ బిర్యానీ పండుగ’ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా తమిళనాడులోని ప్రసిద్ధ అంబూర్‌ బిర్యానీకి భౌగోళిక గుర్తింపుపై స్టాల్స్‌ నిర్వాహకులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే బిర్యానీ ఫెస్టివల్‌ సందర్భంగా 20రకాల బిర్యానీ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మెనూలో బీఫ్‌ బిర్యానీని మినహాయించారు అధికారులు. అయితే వర్షాల కారణంతో బిర్యానీ ఫెస్టివల్‌ను కూడా వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

కాగ‌,ఆ బిర్యానీ ఫెస్టివల్‌ మెనూ నుంచి గొడ్డు మాంసం (బీఫ్‌) బిర్యానీని తొలగించడంపై కొందరు ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్‌ తిరుపత్తూరు జిల్లా కలెక్టర్‌ అమర్ కుష్వాహను దీనిపై నిలదీసింది. వర్గ వివక్షతో కూడిన ఈ నిర్ణయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెల‌పాల‌ని ఆ నోటీసులో ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement