Wednesday, April 24, 2024

Tollywood Drugs Case: మత్తులో జోగుతుందెవరు.. విచారణకు మళ్లీ సినీ తారలు?

మూడేళ్ల క్రితం సెలబ్రిటీలు, రాజకీయ నేతలను గడగడలాడించిన డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు ఈ కేసును విచారించిన ఎక్సైజ్‌శాఖ నిజాలను ఎందుకు దాచిందనేది తేలాల్సిన ప్రశ్నగా మారింది. ఎక్సైజ్‌ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సినీ పరిశ్రమకు చెందిన 16 మందికి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. డ్రగ్స్‌ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్‌ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. ఓవైపు ఈడీ ఎంటరైన నేపథ్యంలోనే సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ సందేహాలు తీరలేదు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇటీవల పరిణామాల్లో కొంతమంది రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలపై కూడా డ్రగ్స్‌, పేకాట ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ నివేదిక మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అబ్కారీ శాఖ నివేదికలో రాజకీయ ప్రముఖులు ఉండటంతోనే ఈ కేసును పక్కదారి పట్టించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈడీ కూడా ఎక్సైజ్‌ శాఖ తీరును తప్పుపట్టింది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మొత్తంగా మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్‌ శాఖ ఇచ్చేసింది. డిజిటల్‌ రికార్డ్స్‌, కాల్‌ డేటా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలను ఈడీకి అందజేశారు. వివరాలన్నీ అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం మెమో దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్‌ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్‌ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్‌ కేసు డిజిటల్‌ డేటా ఇవ్వడం లేదని అదే నెల 23న ఈడీ పిటిషన్‌ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ ఆరోపించింది. సీఎస్‌ సోమేష్‌కుమార్‌, ఎక్పైజ్‌శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు న్యాయవాది ద్వారా గత నెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పిటిషన్‌లో వెల్లడించింది.

మళ్లీ రావాలి..

- Advertisement -

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్న ఈడీ ముందుగా ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన డిజిటల్‌ రికార్డ్స్‌, కాల్‌ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మరోసారి సినీతారల్ని విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈసారి విచారణకు తొలుత హాజరయ్యేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. డ్రగ్స్‌ లావాదేవీలు, కొనుగోళ్లు, మనీ లాండరింగ్‌పై ప్రశ్నించనున్నారు.

అనుమానాల కేసు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అవినీతి మరకలంటాయి. 2017లో ఓ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విశ్లేషించిన తర్వాత డ్రగ్స్‌ కేసులను బయటకు తీశారు. హీరో రవితేజ నుంచి పూరి జగన్నాథ్‌, చార్మీ, ముమైత్‌ ఖాన్‌తో సహా మొత్తం ఇరవై మందికిపైగా టాలీవుడ్‌ ప్రముఖులను పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్‌ వాడారో లేదో తేల్చేస్తామని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, అప్పటి ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిషనర్‌ అకున్‌ సభర్వాల్‌ నేతృత్వంలోని విచారణ బృందం ప్రకటించింది. దాదాపుగా అందర్నీ విచారించిన తర్వాత కేసు అతీగతీ లేకుండా పోయింది. ఇదే సమయంలో ఈ కేసు అంశంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ఎక్సైజ్‌శాఖకి దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. 2020 సెప్టెంబర్‌ వరకూ చార్జిషీట్లు దాఖలు చేయలేదని తేలింది.

అనూహ్యంగా ఈడీ ఎంట్రీ ..!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం సంచలనం సృష్టించింది. గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్‌, తరుణ్‌, చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు ఆగస్టు, 2020లో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓవైపు ఈడీ టాలీవుడ్‌ సెలబ్రిటీలను విచారిస్తూండగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో ఎక్సైజ్‌ శాఖ చార్జిషీట్‌ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేకమంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని ఎక్సైజ్‌ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్‌ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవని, నిందితుడు కెల్విన్‌ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. వారినుంచి సేకరించిన శాంపిల్స్‌లో డ్రగ్స్‌ ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఎక్సైజ్‌ శాఖ డ్రగ్స్‌ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు డ్రగ్స్‌ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే గతేడాది సెప్టెంబర్లో సినీతారలందిరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చారు.

ఈడీ బయటకు తీస్తుందా?

ప్రస్తుతం ఈడీ చేతికి కీలక ఆధారాలు వెళ్లిన్లటంది. రాజకీయ నేతలు, బడాబాబులు, సినీ తారలను కాపాడేందుకే ఎక్సైజ్‌శాఖ ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. అంతేగాకుండా డ్రగ్స్‌ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ కూడా అనూహ్యంగా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. దీనిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు కీలకమైన ఫైళ్లు ఈడీకి ఇవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే, కెల్విన్‌ చెప్పిన వారందరినీ మళ్లిd విచారణకు పిలుస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కెల్విన్‌ విచారణలో చాలామంది రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల్లోనే ఎక్సైజ్‌ శాఖ ఈడీకి వివరాలన్నీ పంపించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement