Saturday, March 25, 2023

Spl Story: ఎవర్రా, ఈ పోస్టు పెట్టింది?.. డిజిటల్​ మీడియా కట్టడికి మోడీ ఫ్యాక్టరీలో కొత్త కత్తెర్లు!

డిజిటల్​ మీడియా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్​ తెస్తోంది. ప్రధాని మోదీ ఫ్యాక్టరీలో కొత్తరకం కత్తెర్లకు ఆర్డర్​ అందింది. ఇకమీదట కేంద్రంపై కానీ, ప్రభుత్వ విధానాలపై కానీ ఇష్టమున్నట్టు రాస్తే అంతే సంగతులు అన్నట్టు వ్యవహారం ఉండబోతోంది. దీనికి రూల్స్​ రెడీ చేసే పనిలో అధికారులున్నారు. ఇప్పటికే పార్లమెంట్​లో ప్రొటెస్ట్​ చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ సభ్యులు అన్​పార్లమెంటరీ వర్డ్స్​ వాడొద్దని కొత్త కొత్త పదాలను లాగ్​ బుక్​లో చేర్చింది కేంద్రం.. ఇక.. ఇప్పుడు డిజిటల్​ మీడియా అంతుచూసే పని ముంగటేసుకున్నట్టు తెలుస్తోంది!!​

– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

- Advertisement -
   

ఫేస్​బుక్​, ట్విట్టర్​తోపాటు మొత్తం డిజిటల్​ మీడియాను కట్టడి చేసి, కత్తెరేసే సీజర్స్​ తయారవుతున్నాయి. ఎస్​.. ఈ కత్తెర్ల పదును ఎంత ఉండాలన్న లెక్కలు వేసే పనిలో అధికారులున్నారు. 2011 నాటి ఇన్​ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ని పై నుంచి కింది దాకా సమూలంగా మార్చేసే ప్రక్షాళన ప్రక్రియ కూడా మొదలైపోయినట్టు తెలుస్తోంది. సోషల్​ మీడియా కంపెనీలను అడ కత్తెరలో బంధించే ఈ ప్రోగ్రామ్​ తయారై అమల్లోకి వస్తే కనుక ఇక చట్టబద్ధం కాని కంటెంట్​ పెట్టేవాళ్ల మీద కత్తులు దూస్తారన్నది మాత్రం నిజం. తొలుత ఏదైనా మీడియా ప్లాట్​ ఫాం ప్రారంభించిన 90 రోజుల్లోగా రిజిస్ట్రేషన్​ చేసుకోకుంటే సీరియస్​ యాక్షన్​ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఇందులో మొదటగా పిడిబాకులు దిగే అవకాశలున్నది ఆన్​లైన్​ మీడియా మేనేజ్​మెంట్​ కంపెనీలపైనే. ఇప్పటిదాకా ఇష్టమున్నట్టు ఫేక్​ న్యూస్​ వైరల్​ చేస్తున్న వారికి ఇది బ్యాడ్​ న్యూస్​ అనే చెప్పవచ్చు. ఎందుకంటే వారి వెబ్​సైట్​ ర్యాంక్​ ఇంక్రీజ్​ చేసుకోవడానికి, ఎక్కువ మొత్తంలో క్లిక్కింగ్స్​ రావడానికి తెలిసీ, తెలియని.. తప్పుడు  సమాచారం.. ప్రభుత్వాలను, ప్రభుత్వ పెద్దలను బద్​నాం చేసేలా ఇష్టమున్నట్టు వార్తలు వండి, సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక.. అట్లాంటి మెసేజుల్లో ఏదైనా ఒకటి వైరలై సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుంటే కనుక.. అసలు దాన్ని మొట్టమొదట పంపించింది ఎవరన్న దాన్ని గుర్తించాల్సిన బాధ్యతను ఆయా కంపెనీలకే అప్పజెప్పేలా కొత్త రూల్స్​ రూపొంచబోతున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి చేతులు వారి నెత్తిన పెట్టేలా.. ఆయా మీడియా సంస్థలే దానికి జవాబూదారీ తనం వహించాల్సి ఉంటుంది.

ఇక.. రెండోది ప్రతి సోషల్​ మీడియా కంపెనీ తాము పెట్టే పోస్టులపైన ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని రెడీ చేసుకోవాలి. ప్రతి సంస్థ కాకపోయినా ఇందులో చిన్నా, పెద్దా కెటగిరీలు ఉండే చాన్సెస్​ కూడా ఉండబోతున్నాయన్న  వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఫైనల్​ గైడ్​లైన్స్​ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ కంపెనీ విదేశాల్లో ఉంటే కనుక దేశంలో దానికి సంబంధించిన ఒక ముఖ్య అధికారి ఉండాల్సిందే. వాళ్లకి దేశంలో ఉన్న చట్టాల పట్ల నియమ నిబంధనలపై నిర్ధిష్టమైన అవగాహన ఉండి తీరాలన్నది ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాల్లో ముఖ్యమైనది తెలుస్తోంది. ఇప్పట్లో అసత్య వార్తలనబడే ఫేక్​ న్యూస్​కు ప్రాణం పోస్తున్న కొంతమంది.. వాళ్లు నిర్వహిస్తున్న బ్లాగ్స్​, వెబ్​ పోర్టల్స్​​, పెడుతున్న పోస్టులు.. ఇష్టానుసారంగా, నిర్లక్ష్యంగా ప్రసారం చేస్తున్న వార్తలు, వీడియోలన్నీ ఇక ముందు స్కానర్​ కిందకు రాబోతున్నాయి.

గతంలోనే ఇట్లాంటి చట్టాలను తయారు చేస్తారనప్పుడే మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాయి. ఇటువంటి నిబంధనలు వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయన్న వాదనలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు అన్ని విమర్శల్నీ, సూచనల్నీ  లెక్కలోకి తీసుకుని కేంద్రం కఠిన నిబంధనలు రూపొందించనున్నట్టు సమాచారం.

అయితే.. ఇట్లాంటి ఫేక్​ మేస్సేజులు, వార్తలను నియంత్రించడానికి ఇప్పటికైతే ఎట్లాంటి యంత్రాంగం లేదు. ఎవరుపడితే వాళ్లు సోషల్​ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు కలగజేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇక.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో అనేక రకాల ఉల్లంఘనలు జరుగుతున్నా రేపుటి రోజుల్లో ఇట్లాంటి కొత్త కొత్త రూల్స్​, నియంత్రణలతో అసలు అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలు కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇట్లాంటి కొత్త రూల్స్​ అమల్లోకి వస్తే కనుక ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం కలగజేసుకునే అవకాశమూ ఉంది. అంతేకాకుండా పోలీసులు ఎంటరవుతారు. అప్పుడు వాళ్లడిగే మొట్టమొదటి ప్రశ్న? ఎవర్రా, ఈ పోస్టు పెట్టింది? ఇక డిజిటల్​ మీడియా పేరుతో అరాచకం సృష్టిస్తున్న వెబ్​సైట్లు, వ్యక్తులు ఆలోచించాల్సిందే మరి?!

Advertisement

తాజా వార్తలు

Advertisement