Wednesday, April 24, 2024

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దారెటు?

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు? హస్తం నీడలో చేరుతారా ? లేక కాషాయ కండువా కప్పుకుంటారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు హట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక రాజకీయాలకు దూరంగా ఉన్న కొండా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా వ్యవహారంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఒక దశలో ఈటలతో కలిసి కొండా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ కూడా జరిగింది. అయితే, ఈటల బీజేపీలో చేరడంతో అంతా సైలెంట్ అయ్యారు. అనంతరం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి రాబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను కలిసిన సందర్భంగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి కొండా సిద్దమయ్యారు.

అయితే కొండా తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ నేతతో కలిసి ఆపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్‌ను కలవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన ఈటలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు కలిశారనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డితో, అటు ఈటల రాజేందర్ తో కొండాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈటల రాజేందర్‌ను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నించారనే వార్తలు వినిపించాయి. అయితే, ఈటల మాత్రం బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికతో ఈటల బీజీగా ఉన్నారు. ఇక, రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్నది ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరో పేరు!

Advertisement

తాజా వార్తలు

Advertisement