Thursday, March 28, 2024

ఈటల పొలిటికల్ ఎజెండా ఏంటి ?

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడో సంచనలం. ఈటల టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? కొత్త పార్టీ పెడుతారా? అన్నది సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం తన నియోజవకర్గం అయిన హుజురాబాద్ కు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులతో ఈటల గత రెండు రోజులుగు చర్చలు జరుపుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.  రాజేందర్​ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజులుగా తన మద్దతుదారులు, పలువురు పార్టీ నేతలు, ఉద్యమ సమయంలోని సన్నిహితులతో చర్చించిన ఈటల… ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తన సొంత నియోజకవర్గం నుంచి విదేశాల్లో ఉన్న సన్నిహితులు, ఎన్ఆర్ఐల అభిప్రాయాలను తీసుకున్నారు. మరోవైపు ఈటల వర్గం.. సొంత పార్టీ ఏర్పాటుపై బీసీ వర్గాల నేతలు, టీఆర్ఎస్ అసంతృప్తులు, తెలంగాణ ఉద్యమకారుల నుంచి సైతం అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడారు. మెజార్టీ వర్గాలు సొంత పార్టీ అయితేనే మనుగడ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్​ దూరం పెట్టిన వారందరినీ కలుపుకుపోవాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన ప్రొపెసర్​ కోదండరాం సహా చెరుకు సుధాకర్, విజయరామారావు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు తీన్మార్​ మల్లన్న వరకు అందరితో జట్టు కట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పేరుతోనే ఈటల పార్టీ ఉండే అవకాశం ఉంది. పార్టీ కోసం ముందుగా ఎలా ముందుకెళ్లాలి, పాత పార్టీ పేరును తీసుకుంటే ఎలా మార్పిడి చేసుకోవాలనే అంశాలపై కూడా ఆరా తీస్తున్సట్లు సమాచారం. ఇక ఈటల అనుచరులు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు.

ఇదిఇలా ఉంటే.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేసిన తర్వాత కూడా ఓపికతో ఉన్న ఈటల… నియోజకవర్గానికి వెళ్లి, అక్కడ మద్దతుదారులతో చర్చల అనంతరం విమర్శలకు పదును పెడుతున్నారు. తప్పుడు సలహాలతో సీఎం తనపై కక్ష కడుతున్నారని, మంత్రివర్గంలో ఉండి కూడా ప్రగతిభవన్​కు వెళ్లే పరిస్థితి లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలువురు మంత్రులు తనపై చేసిన విమర్శలను కూడా తిప్పికొట్టారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనను బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈటల రాజీనామా ప్రకటించాక వేటేస్తారా, అంతకుముందే పార్టీ నుంచి వెళ్లగొడతారా అనేది ఉత్కంఠగా మారింది. బర్తరఫ్ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న రాజేందర్.. సీఎం కేసీఆర్ పై ప్రతివిమర్శలు చేయడమేకాకుండా టీఆర్ఎస్ సర్కారుపై హైకోర్టులో న్యాయపోరాటానికి దిగడంతో ఆయపై గులాబీ దళం విరుచుకుపడింది. తెలంగాణ భవన్ వేదికగా ఉమ్మడి కరీంనగర్ నేతలంతా ఏకమై ఈటల గుట్టువిప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు ఈటలపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.

అయితే,ఈటల మాత్రం తదుపరి అడుగులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నారైలతో, వివిధ వర్గాలతో కాన్ఫరెన్సులు, మీటింగ్స్ జరుపుతున్నారు. పార్టీ పెట్టడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమా? సొంత పార్టీ పెట్టడమా ? లేక మరో నిర్ణయమా అనేది ఈటల ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement