Friday, April 26, 2024

ఇక అత్యున్న‌త విద్యావేత్త‌లే భావి భార‌త పాల‌కులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – 2029 ఎన్నికల నాటికి దేశం యావత్‌ నాయకుల కొరత ఎదుర్కొనే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ప్రస్తుత పాలకులు అప్పటి ఎన్నికలకు వయోవృద్దులౌతున్నారు. ప్రధాన పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి తగిన ప్రోత్సాహం కొరవడ్డంతో పాలకుల అనంతరం సమర్ధవంతులైన రాజకీయ దక్షులు అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ముందుగా బీజేపీ గుర్తించింది. దేశవ్యాప్తంగా మేథావులైన యువతను ఎంపిక చేసి ఇప్పటి నుంచే వారికి పార్టీ విధి విధానాల్ని నూరిపోసి వారిలో నాయకత్వ పటిమ పెంచే ప్రయత్నాలు ప్రారంభిం చింది. ఇందుకోసం ఆ పార్టీ భారత్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎమ్‌ల విద్యార్థులపై దృష్టిపెట్టింది. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం పదేసి మందిని ఎంపిక చేయాలని ప్రతిపాదించింది. వీరిని భావిభారత రాజకీయవేత్తలుగా రూపు దిద్దనుంది. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీ యంగా మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఈ సంస్థల్లో మేథావులకు గాని సీటు లభిం చవు. ఇక్కడ కేవలం విద్యాబోధనే కాకుండా వ్యక్తిత్వ వికాసం కూడా అబ్బుతుంది. ప్రపంచ పరిణామాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అన్నింటికి మించి నాయకత్వ లక్షణాల్ని పెంపొందిస్తారు. వీటన్నింటిని
దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ విద్యాసంస్థల పట్టభద్రులపై దృష్టి సారించింది.

ఇప్పుడు భారత్‌ ప్రపంచానికి నాయకుల్ని సరఫరా చేసే కేంద్రంగా మారింది. వివిధ దేశాల్లో కీలకపాలనా పదవులతో పాటు బహుళ జాతీయ కంపెనీలకు నిర్వాహకులుగా, సీఈవోలుగా భారతీయులున్నారు. అలాగే పలు దేశాల్లో న్యాయమూర్తులుగా, వైద్యాధికారులుగా, ఇంజనీర్లుగా భారతీయులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు ఆర్థిక శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థల్లో భారతీయులే అత్యధికంగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు.
ఒకప్పుడు ప్రపంచానికి ధర్మాన్ని బోధించిన భారత్‌ ఇప్పుడు భవిష్యత్‌ దిశా నిర్దేశంచేస్తోంది. ఈ క్రమంలో ఐఐటీ, ఐఐఎమ్‌ విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరి పట్లే ప్రపంచ స్థాయి వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో పాటు పాలనాయంత్రాంగాలు కూడా ఆకర్షణ ప్రదర్శిస్తున్నాయి. ఐఐటీ, ఐఐఎమ్‌ల పట్టభధ్రులు విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. కాగా వారి సేవల్ని ఇప్పుడు భారతీయ రాజకీయ రంగంలో కూడా వినియోగించుకునే ప్రయత్నం మొదలైంది. గతకొన్నేళ్ళుగా ఈ విద్యాసంస్థల పట్టభద్రులే ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పుడు నేరుగా వారినే అభ్యర్థులుగా భవిష్యత్‌ నాయకులుగా బరిలో దింపాలన్న యోచనకు బీజేపీ వచ్చింది. తద్వారా భవిష్యత్‌ భారత పాలకులుగా అత్యున్నత విద్యార్హతలు కలిగిన వ్యక్తుల్ని ఈ దేశానికి అందుబాటులో ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

బీఆర్‌ఎస్‌లో గుర్తింపు పొందిన ద్వితీయ నాయకత్వం
ఒక్క బీజేపీయేకాదు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు కూడా నాయకత్వ కొరత ఎదుర్కొంటున్నాయి. ఎక్కడో బీఆర్‌ఎస్‌ వంటి ఒకట్రెండు పార్టీలు మినహా మిగిలిన పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం గుర్తింపునకు నోచుకోలేదు. బీఆర్‌ఎస్‌లో మాత్రం కేసీఆర్‌ తన తనయుడు కేటీఆర్‌ను విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని మాన్పించి మరీ తెలంగాణా ఉద్యమంలో పాత్రధారిని చేశారు.
అప్పటి నుంచి కేటీఆర్‌ను జనజీవనంలో మమేకమయ్యేలా తర్పీదు నిచ్చారు. గత ఆరేళ్ళుగా ప్రభుత్వంలో, పార్టీలో కేటీఆర్‌ నెంబర్‌2గా వ్యవహరిస్తున్నారు. తండ్రి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకున్నారు.

ఏపీలో భిన్నవైఖరి
అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ నాయకుల కొరత ఎదుర్కొంటోంది. అధికారంలో ఉన్న వైకాపా అధినేత జగన్‌ వయసు రీత్యా మరో మూడు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాలు చేయగలిగే సామర్ద్యం కలిగున్నారు. ఆ పార్టీలో ఆయన తర్వాత స్థానం ఎవరిదన్న ప్రశ్నకు జవాబు లేదు. మరో పార్టీ జనసేన భవిష్యత్‌పై స్పష్టతతో ముందుకెళ్తోంది. అధికారమే లక్ష్యంగా కాకుండా పాతికేళ్ళ పాటు రాజకీయాలు చేయగలిగే సామర్థ్యం కలిగిన వారినే నాయకులుగా ఎంచుకుంటోంది.

- Advertisement -

పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదీ అదే పరిస్థితి
ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్‌ కుటుంబం దీర్ఘకాలం రాజకీ యాల్లో కొనసాగే అవకాశమున్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఎస్‌పీకి రెండో తరం నాయకత్వ కొరత నెలకొంది. అలాగే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి కూడా సమర్ధులైన ద్వితీయ శ్రేణిలో సమర్ధులైన నాయకులు అందుబాటులో లేరు. తృణమూల్‌ కాంగ్రెస్‌లో మమత తర్వాత సమర్ధులు అందుబాటులో లేరు. బిజూ జనతాదళ్‌లోనూ నవీన్‌ పట్నాయక్‌ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో సెక్యులర్‌ జనతాదళ్‌ పార్టీ కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వ కొరతతో సతమతమౌతోంది. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీలో కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు అన్నాడీఎంకే కూడా ద్వితీయ శ్రేణి నాయకుల్ని ప్రోత్సహించడంలో ఘోరంగా విఫల మైంది. అధికార డీఎంకే అధినేత స్టాలిన్‌ గతం నుంచి తన కుమారుడు ఉదయ్‌నిధిని ప్రత్యామ్నాయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో సఫలమౌ తున్నారు. తాజాగా తమి ళనాడు బీజేపీలో భవిష్య త్‌ నాయకుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. ఇందు కోసం ఐఐటీ, ఐఐఎమ్‌ విద్యా సంస్థల పట్టభద్రుల నుండి ఎంపిక లు ప్రారంభించారు. వీరైతే మారుతు న్న సమాజం, అంతర్జాతీయ పరిణా మాలకనుగుణగా ఎప్పటికప్పు డు పార్టీల వైఖరిలో కొత్త మార్పులు ప్రవేశ పెట్టి ప్రజలకవసరమైన విధంగా పార్టీల్ని తీర్చిదిద్దగలరన్న విశ్వాసం అధినేతల్లో వ్యక్తమౌతోంది. దీంతో భవిష్యత్‌ నాయకులు, పాలకులు కూడా అత్యున్నత విద్యార్హతలు కలిగిన ఉత్సాహవంతులు, దూర దృష్టిపరులే కానున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement