Friday, May 20, 2022

Followup: పాక్‌ నుంచి తెలంగాణకు ఆయుధాలు.. పట్టుబడ్డ ఖలిస్తానీ ఉగ్రవాదులు

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదం జడలువిప్పుతోందా..? పంజాబ్‌ వేర్పాటు వాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పాకిస్తాన్‌ అందజేస్తున్న ఆయుధాలను తాజాగా తెలంగాణ వైపు తీసుకువచ్చే ప్రయత్నం జరిగిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాకిస్తాన్‌ నుంచి ఆదిలాబాద్‌కు సరఫరా అవుతున్న మారణాయుధాలను తాజాగా హర్యానా పోలీసులు కర్నల్‌ జిల్లాలో పట్టుకోవడం అందుకు అద్దం పడుతోంది. పట్టుబడ్డ యువకుల్లో ఒకరికి ఖలిస్తానీ ఉగ్రవాది అయిన బబ్బర్‌ ఖాల్సాకు సంబంధాలున్నట్లు రుజువు అవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెల కొంది. ఇన్నాళ్లు పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఖలిస్తానీ ఉగ్రవాదం చాపకింద నీరులా తెలంగాణ, మహారాష్ట్రలో వ్యాపిస్తుండటం తో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లయ్యాయి. ఇటీవల పంజాబ్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని ఆందోళనకారులు రాష్ట్రం వెలుపలే నిలిపివేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కాగా, ఇది ఖలిస్తాన్‌ స్వాతంత్య్రానికి నాంది అని సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ వ్యవస్థాపకులు గురు పట్వాంట సింగ్‌ ప్రకటించడం నిఘావర్గాలను మరింత ఆందోళనకు గురిచేసింది.

తాజాగా ఆదిలాబాద్‌కు మారణాయుధాల సరఫరా
దాదాపు రెండు దశాబ్దాల పాటు ఖలిస్తాన్‌ ఉగ్రవాదం ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఉన్నప్పటికీ తాజాగా పాకిస్తాన్‌ నుంచి మారణాయుధాలను తెలంగాణలోని ఆదిలాబాద్‌కు సరఫరా చేయడంతో విషయం చర్చనీయాంశమైంది. డ్రోన్‌ల ద్వారా పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన ఆయుధాలను నలుగురు యువకులు ఆదిలాబాద్‌ పరిసరాల్లోకి సరఫరా చేస్తూ హర్యానాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఆయుధాలు పక్కా ప్లాన్‌ ప్రకారం ఆదిలాబాద్‌కు చేరి ఉంటే హైదరాబాద్‌, నాందేడ్‌లలో ఉగ్రవాదులు పన్నిన కుట్ర సత్ఫలితాలను ఇచ్చేది. కానీ ఆయుధాలు పోలీసులకు చిక్కడంతో వ్యవహారం ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే హర్యానాలో పోలీసులకు చిక్కిన గురుప్రీత్‌, అమర్‌దీప్‌, భూపేందర్‌, పర్మేందర్‌లలో ఒకరికి ఖలిస్తానీ ఉగ్రవాది బబ్బర్‌ ఖాల్సాతో సంబంధాలున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయుధాలు పాకిస్తాన్‌ నుంచి ఆదిలాబాద్‌కు వయా నాందేడ్‌ మీదుగా సరఫరా అయ్యేందుకు ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మొత్తంగా వేర్పాటువాదం కోసం పురుడు పోసుకున్న ఖలిస్తానీ ఉగ్రవాదులను పాకిస్తానీ ఐఎస్‌ఐ ఉగ్రవాదులు పూర్తిస్థాయిలో వినియోగించుకుని భారతదేశంలో అలజడి సృష్టించేందుకు పన్నాగం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement