Thursday, March 28, 2024

Breaking: వరల్డ్​లోనే టాప్ 30 సిటీస్​లో హైద‌రాబాద్‌ ఉండేలా చేస్తాం: మంత్రి కేటీఆర్‌

ప్ర‌పంచంలోని టాప్ 30 సిటీస్​లో హైద‌రాబాద్‌ను ఒక‌టిగా ఉంచ‌డ‌మే త‌మ ల‌క్ష్యమ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామని చెప్పారు. తెలంగాణలో పట్టణాలు, నగరాలకు ఆర్థిక వనరులు, మానవ వనరులను సమకూరుస్తున్నామని, మున్సిపల్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని వెల్ల‌డించారు. పట్టణాలకు ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్‌ శాఖలో సమ్మిళితమైన – సమీకృత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయ‌ని, రాష్ట్రంలో మరికొన్ని నగరాలను స్మార్ట్‌ సిటీలుల కింద చేర్చాల‌ని మంత్రి కేటీఆర్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్‌, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్ల‌డించారు. హైదరాబాద్‌ నగరం రోడ్లు బాగుండాలనే ఉద్దేశంతో సీఆర్‌ఎంపీ కింద తీసుకున్నామని, హైదరాబాద్‌ నగర పరిస్థితి, ఇమేజ్‌ రోడ్ల నాణ్యత మీద ఆధారపడి ఉంటుందన్నారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వార్డులకు కలిపి ఒక అధికారి, 50వేలకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో వార్డుకు ఒక అధికారిని నియమించనున్నట్లు మంత్రి కేటీఆర్ వివ‌రించారు. వచ్చే సంక్రాంతి కల్లా 100 శాతం మురుగు నీటి వ్యర్థాలను శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ దేశంలోనే గుర్తింపు పొందుతుందన్నారు. హైదరాబాద్‌లో భవిష్యత్‌ తరాలకు ఎలాంటి నీటి కొరత లేకుండా సుంకిశాల వద్ద రూ.1450కోట్ల వ్యయంతో ఇంటెక్‌వెల్‌ పనులను ప్రారంభించామ‌ని తెలిపారు.

టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా పట్టణాలకు 4 వేల కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని పది పట్టణాలను గుర్తించి రూ.2410 కోట్లతో 104 రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగుపడుతాయని తెలిపారు. టీఎస్‌బీపాస్‌ ద్వారా 1.15 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీలో రూ.3500కోట్ల విలువైన టీడీఆర్‌ ధృవపత్రాలను జారీ చేసిందన్నారు.

కేంద్రం పాదర్శకంగా ఉంటే మ‌రిన్ని అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో భాగంగా 2021 లో తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయని, ప్రస్తుత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అవార్డులు ఇస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో అవార్డులు వస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్వనిధిలో వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పట్టణాలు, నగరాల, జనాభా వారీ కేటగిరీల్లో రాష్ట్ర పట్టణాల్లో టాప్ 10కి పది మనవే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అవార్డులు లభిస్తున్నాయన్నారు. లివింగ్‌ , ఇన్‌ క్లూజివ్‌ శ్రేణి అవార్డు కింద స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌లో రెండు పడకల గృహ నిర్మాణ పథకం ఫైనలిస్ట్‌గా ఎంపికైందని వెల్ల‌డించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ 21 కిలోమీటర్ల పరిధిలో సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటుచేస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేసి 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

మున్సిప‌ల్ శాఖ‌ది థాంక్‌ లెస్‌ జాబ్‌…
ఐటీ శాఖ గ్లామరస్‌ జాబ్‌ అని, కానీ, మున్సిపల్‌ శాఖది మాత్రం థాంక్‌లెస్‌ జాబ్‌ అంటూ మంత్రి కే తారక రామారావు వ్యాఖ్యానించారు. మున్సిపల్‌ శాఖలో పనిచేయకుంటే అందరు విమర్శిస్తారని, పనిచేస్తే మాత్రం ఒక్కరు కూడా అభినందించరన్నారు. మున్సిపల్‌ శాఖలో అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు నిత్యం పనిచేస్తున్నారని, వారందరినీ అభిందిస్తున్నానని చెప్పారు. వారందరూ పనిచేయడం వల్లే నగరాలు, పట్టణాలు బాగా ఉన్నాయన్నారు. పట్టణ ప్రగతి కింద పట్టణాలు, నగరాలకు రూ.3700కోట్లకు పైగా విడుదల చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement