Saturday, April 20, 2024

డ్రాగ‌న్ కంట్రీ కుట్ర‌ల‌కు స‌రైన‌ రిప్ల‌య్ ఇస్తాం: ఆర్మీ చీఫ్ న‌వ‌ర‌ణె

దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే చైనా కుట్ర‌ల‌ను ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం. ఎం. నరవణె పునరుద్ఘాటించారు. భారత్ ఎల్లవేళలా శాంతినే కాంక్షిస్తుందని.. అది బలం నుంచి పుట్టిన ఆకాంక్షేనని స్పష్టం చేశారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఆయన పరోక్షంగా చైనాను ఘాటుగా హెచ్చరించారు. ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకొంటారు. 1949లో బ్రిటిష్ వారి నుంచి భారత సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్పా బాధ్యతలు స్వీకరించినందుకు ఈరోజును జరపుకొంటున్నారు.

సమానత్వం, పరస్పర భద్రత సూత్రాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న నిబంధనల ద్వారానే వివాదాల పరిష్కారం జరుగుతుందని ఆర్మీ చీఫ్ నరవణె స్పష్టం చేశారు. భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని ఏళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్ ఆర్మీ ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చే ప్రయత్నం చేయడంతో భారత్ వాటిని దీటుగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మే 5, 2020న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి పలు దఫాల్లో చర్చలు జరిపినప్పటికీ.. చైనా తన వక్రబుద్ధిని మాత్రం వదులుకోవడం లేదు. సరిహద్దుల్లో ఏదో రకమైన అలజడి సృష్టిస్తూ భారత్ను కవ్వించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. భారత్ సైన్యం వాటిని దీటుగా తిప్పికొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement