Thursday, April 25, 2024

ఈటలతో కొండా ఏం చర్చించారు?

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజకీయ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న వేళ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్​తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు నేతలు భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే కొండా కూడా కాంగ్రెస్​కు రాజీనామా చేయటం… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలను కలవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శామీర్​పేటలోని ఈటల నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఓ మిత్రునిగా.. కలిసి మాట్లాడేందుకు వచ్చినట్లు కొండా తెలిపారు. రాజకీయాలు చర్చించేందుకు రాలేదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా… తెలంగాణ ప్రజలు వెన్నంటే ఉంటారని ఈటలతో చెప్పినట్టు కొండా తెలిపారు. ఇతర విషయాలు ఏమీ మాట్లాడలేదని, రాజకీయాలు అసలు చర్చకే రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందులో ఇదొకటని పేర్కొన్నారు. దీన్ని అవమానంగా భావించొద్దని… ఈ చర్య వల్ల మంచే జరిగిందని ధైర్యం చెప్పినట్టు కొండా చెప్పారు.

ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన వరుసగా కార్యకర్తలు, అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న వెళ్ల.. ఈటలతో కొండా భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా – ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.  కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరి 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటలను కొండా కలవడంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ ఉద్యమంతో పాటు టీఆర్ఎస్‌లోనూ కలిసి పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement