Thursday, April 25, 2024

Story : అమరావతిలో శ్రీవారి ఆలయం రెడీ.. 40 కోట్లతో నిర్మించిన టీటీడీ

తిరుపతి, ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ) : రాష్ట్ర రాజధానినగరం అమరావతి సమీపంలో టిటిడి రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈ నెల 5 నుంచి కొనసాగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 8వ తేదిన ఆలయ విమాన, గోపురశిఖర, మూలవిగ్రహ స్ధాపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల9వ తేదిన ఉదయం నిర్వహించే మహాసం ప్రోక్షణ కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించనున్నది. మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తితత్వ సంప్రదాయాలను వ్యాప్తి చేసే లక్ష్యంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుమలేశుని నమూనా ఆలయాలను నిర్మించాలని దశాబ్దంక్రితమే తిరుమల తిరుపతి దేవస్ధానాల (టిటిడి) యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే 2017లో నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతి సమీపంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్మించడానికి నాంది జరిగింది. రూ.140 కోట్ల వ్యయంతో తిరుమలేశుని ఆలయంతో పాటు కళ్యాణమండపాలు, వసతిగృహాలతో భారీ సముదాయాలను నిర్మించాలని అప్పటి టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానించింది. అనంతరం 2018 ఆగస్టు 24న అధికారులు 25 ఎకరాలల నిర్మించ తలపెట్టిన ఆలయ నమూనా ప్రణాళికలకు అప్పటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేసారు. 2019లో జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో టిటిడి ఛైర్మన్‌గా నియమితులైన వై వి. సుబ్బారెడ్డి జులై 2వ తేదిన మొదలైన ఆ ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఆపై 2019 సెప్టెంబర్‌ 23వ తేదిన జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో అమరావతి సమీపంలో నిర్మించతలపెట్టిన వేంకటేశ్వర ఆలయంపై చర్చ జరిగింది. పూర్తిస్ధాయి రాజధాని నగరం ఏర్పాటుకాకముందే భారీ ఎత్తున నిధులతో ఆలయంతో పాటు వివిధ సముదాయాలను నిర్మించాల్సిన అవసరం లేదని భావించిన మండలి సమావేశంలో రూ.40 కోట్ల వ్యయంతో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని తీర్మానించింది. ఆ తీర్మానం మేరకు మొదలైన శ్రీ వేంకటేశ్వరాలయం ప్రస్తుతం సర్వాంగసుందరంగా సిద్దమైంది. విజయనగర రాజుల శిల్పశైలిలో ఏకశిలా స్తంభాలు, పల్లవరాజ శిల్పశైలితో గరుడాళ్వార్‌ సన్నిధి, చోళ శిల్పశైలితో గోపురాన్ని నిర్మించారు. మానసూత్రం ప్రకారం 8 అడుగుల 6 అంగుళాల పొడవైన శ్రీ వేంకటేశ్వరస్వామి మూలమూర్తిని కంచి నుంచి, ఆలయ నిర్మాణానికి అవసరమైన లక్షా 20 వేల క్యూబిక్‌ అడుగుల (ఒక క్యూబిక్‌ అడుగు అంటే 85 కిలోలు) శిలలను తమిళనాడులోని నామక్కల్‌ నుంచి తెప్పించినట్టు స్థపతి కృష్ణారావు తెలిపారు.

ఆలయ ప్రధాన ప్రాకారంపై 24 కేశవమూర్తుల రూపాలు, ముఖమండపం పై దశావతారమూర్తులు కొలువై ఉంటేవిధంగా ఆలయ నిర్మాణం పూర్తి చేసారు. తిరుమలేశుని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు వేదాన్తం విష్ణుభట్టాచార్యుల పర్యవేక్షణలో నిర్వహించిన అంకురార్పణ పంచగవ్యాదివాసం తదితర కార్యక్రమాలతో మొదలయ్యాయి. 4వ తేది అంకురార్పణతో మొదలైన శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నవకలశ క్షీరాధివాసం నిర్వహించిన వేదపండితులు మంగళవారం ఆలయంలో ప్రతిష్టించే వేంకటేశ్వర, గరుడ, జయ విజయుల విగ్రహాలకు ఆగ మోక్తంగా చతుర్దశ కలశ స్నపన జలాధివాసం నిర్వహించారు. ఈ నెల 8వ తేదిన విమాన కలశ స్దాపన, గోపుర స్దాపన, మూలవిగ్రత స్ధాపన వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. 9వ తేది ఉదయం 7.30 గంటల నుంచి సుముహూర్తంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి 10.30 గంటలకు పైన భక్తులను స్వామివారిని దరి ్శంచుకోడానికి అనుమతించనున్నారు. ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ భిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తదితర ప్రముఖులందరూ పాల్గొంటారని టిటిడి ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement