Thursday, April 18, 2024

Vaikunta Ekadasi: తెలుగురాష్ట్రాల్లో ఆలయాలు కిటకిట.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి నిత్య సేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. గోవిందనామ స్మరణలతో  తిరుమలకొండలు మార్మోగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో రాజకీయ, సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలు రాష్ట్రాల సీజేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సినీ తారలు స్వామిని దర్శించుకున్నారు. ప్రముఖుల దర్శనాల అనంతరం సామాన్య భక్తుల్ని అనుమతించారు.

ఏపీ మంత్రులు నారాయణ స్వామి, గౌతమ్‌రెడ్డి, అనిల్‌ యాదవ్‌, వెల్లంపల్లి, బాలినేని, అవంతి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ప్రభాకర్‌రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

తెలంగాణలోని భద్రాద్రి రామయ్య ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు వారాల నగలతో సీతారాములు భక్తులకు  దర్శనమిచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement