Thursday, April 25, 2024

యూపీఐ పేమెంట్లు చేసేటప్పుడు జాగ్రత్త

రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు తమ తెలివితేటలతో చాకచక్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని బ్యాంకు అకౌంట్లలో సొమ్మును సులభంగా దోచేస్తున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ మోసమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇటీవల తన మిత్రుడు ఒకరికి ‘ఫోన్‌పే’ ద్వారా రూ. 400 నగదును యూపీఐ పేమెంట్ చేశాడు. అయితే అకౌంట్‌లో నుంచి డబ్బులు అయితే కట్‌ అయ్యాయి.. కానీ సదరు వ్యక్తికి మాత్రం జమ కాలేదు. దీంతో నాగరాజు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసిన విషయాన్ని తెలిపాడు. అయితే కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

ఈ క్రమంలోనే తాజాగా నాగరాజుకు ఎవరో తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఫోన్‌పే కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం.. మీ రూ.400 తిరిగి జమ చేస్తామని నమ్మించాడు. మొబైల్‌ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్‌ కోడ్‌ వచ్చిందని అది చెప్పమని అన్నాడు. దీంతో నాగరాజు ఆ మాటలు నమ్మి అవతలి వ్యక్తికి కోడ్‌ చెప్పాడు. ఆ కోడ్‌ చెప్పిన వెంటనే నాగరాజు అకౌంట్‌ నుంచి రూ.49,248 విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బు ఎందుకు డ్రా అయ్యాయని నాగరాజు అడగ్గా..మరో కోడ్‌ పంపామని.. అది చెప్తే మొత్తం డబ్బు జమ చేస్తామన్నాడు. అయితే ఈసారిమళ్లీ అకౌంట్‌ నుంచి రూ. 48,657 కట్‌ అయ్యాయి. దీంతో వెంటనే సదరు వ్యక్తికి కాల్‌ చేయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రూ. 400 కోసం చూసుకుంటే ఏకంగా రూ. 97 వేలు పోగొట్టుకున్నాడు. అయితే.. సైబర్ నేరానికి పాల్పడిన వ్యక్తి నాగరాజు నెంబర్‌ ఎలా తెలిసిందన్న విషయం మిస్టరీగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement