Thursday, September 21, 2023

Trump card – బిసి కార్డుతో జ‌నంలోకి కాంగ్రెస్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కర్ణాటక ఫలితంతో జోరుమీదున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ పాగా వేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలను మొదలు పెట్టింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజ లను కాంగ్రెస్‌ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తను మొదలు పెట్టారు. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూనే మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తా మో ప్రజలు హామీలను ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ముందుకు సాగుతున్నారు. అందుకు ఎన్ని కల సమయం వరకు 9 డిక్లరేషన్లు ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేత నేత రాహుల్‌గాంధీతో వరంగల్‌ వేదిగా గత ఏడాది మే నెలలో రైతు డిక్లరేషన్‌, ఈనెల 8న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియం వేదిక గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా యువ డిక్లరేషన్‌ను పీసీసీ ప్రకటిం చిన విషయం తెలిసిందే. జూన్‌ రెండు లేదా మూడో వారంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ బహి రంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిం చేందుకు కాంగ్రెస్‌ నేతలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ఆహ్వానించాలని ఇటీవల పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసు కున్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ లను వచ్చే అసెంబ్లి, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆకర్షించే పథకాలను ప్రకటించి.. ఆ వర్గాలను కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.

- Advertisement -
   

బీసీ వర్గాలను నుంచి ప్రధానంగా ఐదారు డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందులో జనగణనలో కుల గణన, బీసీ రిజర్వేషన్లు పెంపు, ఉద్యోగ నియామకాల్లో క్రిమిలేయర్‌ విధానాన్ని ఎత్తి వేయడంతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సొంత పార్టీలోని బీసీ నాయకులతోపాటు బీసీ సంఘాలు, ప్రజల నుంచి గత కొన్నేళ్లుగా డిమాండ్‌ వినిపిస్తున్నారు. బీసీగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హయాంలో న్యాయం జరుగుతుందనే ఆయా వర్గాలకు ఆశపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీసీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రస్‌ నేతలు చెబుతున్నారు. భారత్‌ జోడో యాత్రతో పాటు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానం బీసీ నినాదం ఎత్తుకున్నది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే జనాభా లెక్కల్లో బీసీ కులగణనతోపాటు జనాభా మేరకు రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో క్రిమిలేయర్‌ విధానాన్ని ఎత్తివేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీనే స్వయంగా ప్రకటించారు.

రాహుల్‌గాంధీ ఇచ్చిన నినాదం, ఆ స్ఫూర్తిని ప్రజల్లోకి మరింతగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలనే యోచనలో పీసీసీ నాయకత్వంతోపాటు కాంగ్రెస్‌లోని బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. 2004 ఎన్నికలకు ముందు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అధ్యక్షతన వరంగల్‌లో బీసీ గర్జన నిర్వహించగా.. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ హాజరయ్యారు. బీసీ వర్గాల సమస్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కేడర్‌, నాయకుల్లోనూ ధీమా రావడం.. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి దూరమై తొమ్మిదేళ్లు అవుతుందని, పార్టీ కార్యక్రమాలతోపాటు అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, అభివృద్ధిపైన ప్రజల్లోకి వెళ్లితే.. కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు. అందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట వేదికగా బీసీ గర్జన నిర్వహిస్తే ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లా నుంచి జన సమీకరణ చేయడానికి వీలుగా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు.

మరో ఏడు డిక్లరేషన్లు ప్రకటించేందుకు కసరత్తు..
ఇప్పటికే రైతు, యూత్‌ డిక్టరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ, బీసీ డిక్లరేషన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా తదితర డిక్లరేషన్లు ప్రకటించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆయా డిక్లరేషన్లను ఏఐసీసీ ఆగ్రనేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోనూ కూడా సెప్టెంబర్‌ 17న ప్రకటించాలని నిర్ణయించారు. అయితే ఒక్కో మేనిఫెస్టోను ఒక్కో ఉమ్మడి జిల్లాలో ప్రకటించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సభలు నిర్వహించడం.. డిక్లరేషన్లు ప్రకటించే కార్యక్రమాలను చేపడితే పార్టీ నాయకులు, కేడర్‌లోనూ జోష్‌ రావడం, ప్రజలకు మరింత దగ్గర కావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తద్వారా అధికారంలోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే యోచనలో నాయకులున్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన వీహెచ్‌..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కర్ణాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. దేశ వ్యాప్తంగా పార్టీకి మరింత మైలేజ్‌ వస్తుందని, ప్రత్యేక తెలంగాణాలో కాంగ్రెస్‌కు మరింత బూస్ట్‌ వచ్చిందని అన్నారు. వచ్చే నెలలో తెలంగాణలో నిర్వహించే బీసీ గర్జనకు రావాలని ఆహ్వానించారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు కూడా ఆహ్వానం అందిస్తారని వీహెచ్‌ పేర్కొన్నారు. సిద్ధరామయ్యను కలిసిన వారిలో మాజీ మంత్రి నాసిర్‌ అహ్మద్‌, తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్‌ ఆళగిరి తదిరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement