Saturday, April 20, 2024

సాగర్ ఉపఎన్నిక.. మల్లన్న దారెటు?

తెలంగాణలో ఇప్పుడు అన్ని రాజకీయ దృష్టి నాగార్జునసాగర్ ఎన్నికలపైనే ఉంది ప్రధానంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి సాగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్లే.. సిట్టింగ్ స్థానమైన సాగర్ ను మరోసారి కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని రంగంలో దింపి పూర్వవైభవం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, బీజేపీ.. దుబ్బాక, జిహెచ్ఎంసిలో వచ్చిన ఫలితాలనే సాగర్ లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది. సాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయా పార్టీల నేతలు పర్యటిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ఇప్పుడు టిఆర్ఎస్ ను తీన్మార్ మల్లన్న భయం వెంటాడుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న ఇప్పుడో చర్చనీయాంశంగా మారారు. ఇప్పుడు పార్టీలన్నీ మల్లన్నపై ఫోకస్ పెట్టాయి. త్వరలో జరిగే నాగార్జునాసాగర్ ఉప ఎన్నికల్లో మల్లన్నను తమవైపు లాగేసుకుంటే.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని ప్లాన్ చేస్తున్నాయి. ఇదే సమయంలో మల్లన్న బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతోన్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలోనూ మల్లన్నకు బీజేపీ ముఖ్యనేతల అండదండలున్నాయనే వార్తలు వచ్చాయి. సాగర్ ఉపపోరులో బీజేపీ అభ్యర్థిగా మల్లన్నను బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో తాను ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ మల్లన్న క్లారిటీ ఇచ్చారు. అయితే..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చమటలు పుట్టించిన మల్లన్నతో తమకు నష్టం జరుగుతుందనే భావన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు సోషల్ మీడియాలో మల్లన్నపై రూమర్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పటికే వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ ఇచ్చారు మల్లన్న. ఒక దశలో ఆయనే గెలుస్తారన్నంతగా ప్రచారం జరిగింది. కానీ స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

ఈ సారి ప్రజల్లో మరీముఖ్యంగా యూత్ లో భారీగా సపోర్ట్ సంపాదించి.. అధికార టీఆర్ఎస్ కే గట్టి పోటీ ఇచ్చారు. ఓడిపోయిన సింపథి చాలా ఉంది. ఇదే అభ్యర్థి రేపటి రోజున నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు ఎదురుపడితే పరిస్థితి ఏంటనే దానిపై ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. నాగార్జునా సాగర్ బరిలో ఉంటే.. ఓడిపోయిన సింపతి వర్కౌట్ అయ్యి.. ఓట్లన్ని మల్లన్నకు డైవర్ట్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అదే జరిగితే.. మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారనే అపవాదు టీఆర్ఎస్ ను పట్టుకుంటుంది. ఇప్పటికే దుబ్బాకలో ఓటమితో తలపట్టుకుంటున్నారు. నాగార్జునసాగర్ లోనూ అదే జరిగితే పార్టీ పరువు పోతుంది. అందుకే మల్లన్న వెనక ఏదో ఒక పార్టీ ఉంది… అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆయన ఇమేజ్ ని కొంత మేర డ్యామేజ్ చేయొచ్చు అని ఆపార్టీ నేతలు భావిస్తున్న తెలుస్తోంది. ఇప్పటి దాకా తనది ప్రజల పక్షం.. ఏ పార్టీతో సంబంధం లేదని మల్లన్న చెప్పుకుంటున్నారు. కానీ.. ఆయనకు పలానా పార్టీతో సంబంధాలున్నాయనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే.. అది తమకు పాజిటివ్ గా మారుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తం మీద సాగర్ ఉపఎన్నిక మల్లన్న చుట్టే తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement