Tuesday, March 26, 2024

ఎమ్మెల్సీ పదవిపై రగులుతున్న గులాబీ సైన్యం!

ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై టీఆర్ఎస్ పార్టీలో కుతకుత మొదలైంది. ఉద్యమంలో పోరాడిన వారిని, పార్టీ జెండా మోస్తున్న వారిని వదిలేసి.. రెండు వారాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి పదవి ఇవ్వడంపై సీనియర్లు రగిలిపోతున్నారు. నిజానికి గవర్నర్‍ కోటాలో ఎమ్మెల్సీ పదవిపై చాలా మంది సీనియర్ల ఆశలు పెట్టుకున్నారు. అయితే, వారిని కాదని కౌశిక్ రెడ్డికి ఇవ్వడం చర్చనీయాంశమైంది.

మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‍, ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్‍, టీఆర్‍ఎస్‍ జనరల్‍ సెక్రటరీ శ్రావణ్‍రెడ్డి, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‍ ఎమ్మెల్సీగా అవకాశం దొరకుతుందని భావించారు. నాగార్జునసాగర్‍ ఉప ఎన్నిక సమయంలో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీనియర్‍ నేత కోటిరెడ్డికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‍.రమణను కూడా హుజూరాబాద్‍ టిక్కెట్‍ లేదంటే గవర్నర్‍ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారని ప్రచారం జరిగింది. మాజీ డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యా సాగర్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు, ఆకుల లలిత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర సీనియర్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే, వారిని కాదని కౌశిక్ రెడ్డికి పదవి ఇవ్వడంపై సీనియర్లు ఒకింత అస‌హ‌నానికి లోన‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్‍ పార్టీలో ఉంటూ టీఆర్‍ఎస్‍కు కోవర్ట్ గా పనిచేయడం వల్లే కౌశిక్ రెడ్డికి పదవి వచ్చిందని కొందరు కాంగ్రెస్‍ నేతలు ఆరోపిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‍ కుమార్‍ రెడ్డి తెరవెనక ఉండి పదవి ఇచ్చారని మరో వర్గం ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో హుజూరాబాద్‍ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 60 వేల ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికలో విజయం గెలుపు కోసం కేసీఆర్.. ఆయనకు పదవి ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే, కోవర్టు పనులతో కాంగ్రెస్​ పార్టీ తరిమికొట్టిన కౌశిక్​ రెడ్డిని పెద్దల సభకు పంపడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ అసంతృప్తిని అధినేత కేసీఆర్ కు తెలపాలని మరికొందరు యోచినట్లున్నట్లు సమాచారం. మొత్తం మీద కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌దవి ఇవ్వ‌డం ప‌ట్ల‌ టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు కుత‌కుత‌లాడిపోవడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement