Friday, April 19, 2024

Big Story: న్యాక్‌లో శిక్షణ.. ఉద్యోగం, ఉపాధి పక్కా- నిర్మాణ రంగానికి తగ్గట్టు ట్రైనింగ్‌

ఉద్యోగం, ఉపాధికి విద్యతో పాటు నైపుణ్యత కూడా ఎంతో అవసరం ఉంటుంది. చదువొచ్చినా, రాకున్నా నైపుణ్యత ఉంటే ఉపాధి కచ్చితంగా దొరుకుతుంది. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (న్యాక్‌) ఆధ్వర్యంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మంది నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత కల్పించి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది.


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ‘శిక్షణ- ఉద్యోగం’ అనే నినాదంతో పని చేస్తూ ప్రతి ఏటా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపిస్తున్నది. కోవిడ్‌ సమయంలోనూ దాదాపు 16 వేల మంది వరకు శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించింది. అంతే కాకుండా ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి.. తిరిగొచ్చిన వారికి కూడా న్యాక్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించింది. మన దగ్గర ఏర్పాటైన న్యాక్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తీరును తెలుసుకుని కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ స్కిల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. న్యాక్‌లో ప్రత్యేకంగా కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాక్‌కు 11 అవార్డులు కూడా వచ్చాయి. 2019లో ప్రతిష్టాత్మక అసోచాం సంస్థ బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్లేస్‌మెంట్‌ గోల్డ్‌ విన్నర్‌ అవార్డు ఇచ్చింది.

పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన కార్మికులు..
నిరుద్యోగులకు ఉద్యో, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకంఉడా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన కార్మికులను న్యాక్‌ అందిస్తున్నది. తమకు నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేసి ఇవ్వాలని న్యాక్‌తో 360కి పైగా పేరొందిన సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. అంటే ఇక్కడ ఇచ్చే శిక్షణ ఎంతటి నమ్మకంగా ఉంటుందో తెలుస్తున్నది. ఆయా కంపెనీలు న్యాక్‌లో ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశాయి. 1998లో న్యాక్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,35,122 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,05,407 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలును న్యాక్‌ కల్పించింది.


మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్‌..
రాష్ట్రంలో మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లకు భారీ డిమాండ్‌ ఉన్నది. ఈ రంగాల్లో పని నేర్చుకున్న వాళ్లకు సీనియార్టీ పెరుగుతున్న కొద్ది ఆదాయం కూడా పెరుగుతున్నది. రోజుకు రూ. 1000 తగ్గకుండా వేతనం ఇచ్చి పని చేయించుకుంటున్నారు. న్యాక్‌లో శిక్షణ తీసుకున్న చాల మంది మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డైవాల్‌ ఫాల్‌ సీలింగ్‌లో శిక్షణ పొందిన వాళ్లు కొద్ది కాలం తర్వాత కాంట్రాక్టులు తీసుకుని పని చేస్తున్నారు. డైవాల్‌ ఫాల్‌ సీలింగ్‌లో శిక్షణ తీసుకున్న వారిలో చాల మంది ఇండియన్‌ స్కిల్‌ కాంపిటిషన్‌లో అవార్డులు కూడా సాధించడం విశేషం.

- Advertisement -

కుట్టు మిషిన్‌లో మహిళలకు శిక్షణ..
కార్మిక శాఖ అధికారుల ద్వారా జిల్లాలు, గ్రామాల్లోని నిరుద్యోగులను గుర్తించి, వారిని తీసుకొచ్చి ఉచితంగా భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇస్తారు. రెండు వారాల నుంచి మూడు నెలల వరకు శిక్షణ ఇచ్చే కోర్సులు ఉన్నాయి. ఇక్కడి శిక్షణ తీసుకున్న వారికి శిక్షణ కాలంలో రోజుకు రూ. 350 స్టైపెండ్‌ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక నేషనల్‌ స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తుంది. ప్రతి నెల 1న, 16న కొత్త బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఒక బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకునే వారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సమితి ఫండింగ్‌ చేస్తుంది. అలాగే భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలకు కుట్టు మిషిన్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నది. ఇప్పటీ వరకు 2400 మందిక పైగా కుట్టుమిషిన్లు పంపిణీ చేశారు. ఇక్కడ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులందరికి ప్లేస్‌మెంట్లు వచ్చాయి. 96 మంది బీటెక్‌ విద్యార్థులు పీజీ డిప్లొమా పూర్తి చయగా, 46 మందికి జీహెచ్‌ఎంసీలోని పలు ప్రాజెక్టులలో సైట్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. మరో 50 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement