Wednesday, April 24, 2024

మోడీ, కేసీఆర్ తోడు దొంగ‌లు: రేవంత్ రెడ్డి

పెగాస‌స్ వ్య‌వ‌హారంలో మోడీ, కేసీఆర్ తోడు దొంగ‌లని టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన చలో రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయిందని తెలిపారు. ముట్ట‌డి విజయవంతం చేసిన కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు చేప‌ట్టిన రాజ్ భ‌వ‌న్ ముట్టడిని కేసీఆర్ ప్ర‌భుత్వం లాఠీఛార్జీల‌తో  అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేసిందని మండిపడ్డారు. రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి సంద‌ర్భంగా పోలీసులు వ్య‌వ‌హరించినా తీరు తీవ్ర ఆక్షేప‌నీయం అని అన్నారు. అరెస్టు చేసిన తమ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను బేష‌ర్తుగా వెంట‌నే విడుద‌ల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే ఒకే గూటి ప‌క్షుల‌ని ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి రుజువైందన్నారు. కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిపోయారని రేవంత్ ఆరోపించారు. పెగాస‌స్, స్పైవేర్ నిఘాపై సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న్యాయ విచార‌ణ జ‌రిపించాలని డిమాండ్ చేశారు. న్యాయ విచార‌ణ పూర్తి అయ్యేవ‌ర‌కు హోం మంత్రి అమిత్ షాను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాలన్నారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాని కార్యాల‌యం పాత్ర‌పై విచార‌ణ చేయాలని పేర్కొన్నారు. పెగాస‌స్ వ్యవ‌హారంలో దోషులు బ‌య‌ట ప‌డేవ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ప‌క్షాన పోరాటాలు కొన‌సాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా, కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు నిరసనగా టీ.పీసీసీ ఆధ్వర్యంలో ఆపార్టీ నేతలు చేపట్టిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర నిరసన సభ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: వీడియో: టీఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి, సబితాలకు నిరసన సెగ

Advertisement

తాజా వార్తలు

Advertisement