Thursday, April 25, 2024

రేవంత్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వరుస కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై పోరు బాట పట్టిన రేవంత్.. ఇక తదపరి కార్యచరణ ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది.

పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఇటీవల ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీలు నిర్వహించిన రేవంత్.. శుక్రవారం ఏకంగా చలో రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. గతంలో పీసీసీ అధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు పెద్దగా స్పందన ఉండేది కాదు. కానీ రేవంత్ రాకతో అంతా మారిపోయింది. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో విజయంతో కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త జోష్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దూకుడుగా ఉన్న రేవంత్ తన తదుపరి టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. కోకాపేట భూముల వేలం వ్యవహారంపై ఫోకస్ పెట్టారు.

ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటూ ఖ‌రీదైన కోకాపేట భూముల వేలం ద్వారా రూ. 2000 కోట్లు సంపాదించామ‌న్నగొప్ప‌ల‌పై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కోకాపేట భూముల వేలంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని, ఏకంగా వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ను టీఆరెఎస్ నేత‌లు దోచుకున్నారని ఆరోపించారు. ఆ భూముల‌న్ని టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు, వారి అనుచ‌రుల‌కే ద‌క్కాయ‌న్నారు. శ‌నివారం ఆధారాలు కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. రేవంత్ స్టేట్ మెంట్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

హెచ్‌ఎండీఏ గురువారం రోజు కోకాపేట భూములు వేలం వేయగా.. అధికారుల అంచనాలకు మించి స్పందన వచ్చింది.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది. కోకాపేట్‌ భూముల వేలంలో జరిగిన భారీ స్కామ్‌ వివరాలు రేవంత్ బయట పెడతానని ప్రకటించారు. ఆ భూములు కొన్నది ఎవరు…? రేవంత్ రెడ్డి ఏ టీఆర్ఎస్ నేతల పేర్లు బయట పెడుతారన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement