Thursday, April 25, 2024

వైఎస్ఆర్‌ను తిడితే జగన్ వదిలేసినా.. మేం వదలం: రేవంత్ రెడ్డి

ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు దివంగత నేత వైఎస్ఆర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తుండడంపై నూతన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్‌ను తిడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

‘వైఎస్ఆర్‌ను విధాన పరంగా ఎవరైనా విమర్శిస్తే తప్పులేదు. కానీ చనిపోయిన వ్యక్తి పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పేరు మీద ఏర్పాటు చేసుకున్న పార్టీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలు. జగన్ ఆ పార్టీకి అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి సీఎం. అలాంటి వాళ్లిద్దరూ వైఎస్ఆర్‌ను తిడుతుంటే ఖండించడంలేదు. వాళ్లు వైఎస్ఆర్‌ను వదిలేసుకున్నారని భావించాలేమో. వైఎస్ఆర్‌ను తిడితే జగన్ వదిలేయొచ్చు… కానీ మేం వదిలిపెట్టం… వైఎస్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈ మంత్రుల చెంపచెళ్లుమనిపిస్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవు. వైఎస్సార్… తెలంగాణ కాంగ్రెస్ ఆస్తి. ఆయన బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు. చనిపోయే ముందు కూడా రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు’ అని వివరించారు. తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లను లాగడం మానుకోవాలని తెలంగాణ మంత్రులకు రేవంత్ హితవు పలికారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తమ పాలనలో చేయగలిగినంతా చేశారని, కొన్ని నిర్ణయాల్లో అన్నీ అందరికీ నచ్చకపోవచ్చని, అంతమాత్రాన వారిని ఈ వివాదాలకు బాధ్యులను చేయడం సరికాదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

నీటి వివాదంపై ప్రధాని మోదీని కలవనున్న కేసీఆర్

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో అందుబాటులోకి మరిన్ని రైళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement