Wednesday, March 27, 2024

Toor Dal – ‘ప‌ప్పు’ కూడు ఇక తిన‌లేం…

అమరావతి, ఆంధ్రప్రభ: నిత్యావసరాల ధరలు నానాటికీ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో పేదల నెత్తిన మరో పిడుగు పడింది. నిత్యావస రాల్లో ప్రధాన ఆహార పదార్ధంగా ఉన్న కందిపప్పు ధర ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశ వ్యాప్తంగా పప్పుల ధరలు క్రమేణా పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకూ నూనెల ధరలు పెరుగుతూ వచ్చినా గత కొంతకాలంగా అవి తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చు కుంటున్న జనంపై ఇప్పుడు కందిపప్పు పిడుగు పడుతుంది. గత కొద్ది రోజులుగా కందిపప్పు ధరలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. రెండు నెలల క్రితం కిలో రూ. 102 ఉన్న కందిపప్పు ధర కాస్తా ఇప్పుడు రూ.150కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఈ ధర మరింత పెరిగే అవకాశమున్నట్లుగా వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కిలో రూ. 200 నుండి రూ. 220 వరకూ చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొందరు దళారులు కందిపప్పును క్యాచ్‌ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ డబ్బులు దండుకునే పనిలో ఉన్నారు.

చాలా ప్రాంతాల్లోని సూపర్‌ మార్కెట్లు, మార్టులు, ప్రధాన కిరాణా దుకాణాల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కాస్తో, కూస్తో మార్కెట్‌లో లభ్యమవుతున్న కందిప్పును వ్యాపారులు ధరలు పెంచిమరీ విక్రయిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో కందిపప్పు దర రూ. 150 ఉంది. ఈ ప్రభావం సామాన్యులపై పడి సతమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వేసవి కావడంతో కందిపప్పు విక్రయాలు కాస్త తక్కువగానే ఉంటాయని, వర్షాకాలంలో కొనుగోళ్లు జరుగుతాయని దీంతో ధర మరింత పెరుగుతుందని ప్రధాన వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఇంకోవైపు మినముల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతోపాటు పెసర, శనగ పప్పు ధరలు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు సరిపడ సరఫరా లేకపోవడమేనని తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం కందిపప్పుకు క్వింటాళ్‌కు కనీస మద్దతు ధరను రూ. 6,600గా ప్రకటిస్తే ఆ ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 12,000కు చేరింది. దీనికితోడు డీజిల్‌, పెట్రోల్‌, టోల్‌గేట్ల ప్రభావం కూడా ఈ ధరలపై చూపుతుంది. వ్యాపారులు ఈ రవాణా ఛార్జీలను అదనంగా కలుపుకుని వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు. ఒకవైపు కందిపప్పు ధరలు పెరుగుతున్నా అధికార యంత్రాంగం నిర్దిష్టమైన చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బ్లాక్‌ విక్రయాలు, నిల్వలపై దృష్టిపెట్టక పోవడంతో వ్యాపారులు అందిన కాడికి దండుకుంటున్న పరిస్తితి ఉంది.

తగ్గిన దిగుబడులు
ఇదిలా ఉంటే కందిపప్పు దిగుబడులు 2022-23లో తగ్గిపోవడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదనే వాదన వినిపిస్తుంది. ప్రధానంగా చీడపీడల వల్ల పంట నష్టం జరిగి దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. ఇంకోవైపు కొద్దోగొప్పో రైతుల దగ్గర కందుల నిల్వలు ఉన్నప్పటికీ వాటిని విక్రయించడం లేదు. గిట్టుబాటు ధర సరిపడా లేదని భావిస్తున్న వారు అమ్మకాలకు మొగ్గుచూపడం లేదు. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న కర్నాటక, తెలంగాణలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండటంతో కందిపప్పు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉన్న కొద్ది పంటను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలుచేసి నిల్వలు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈనేపథ్యంలో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement