Thursday, April 18, 2024

నేడు రుతుపవనాల రాక, ఇప్పటికే రాయలసీమలోకి.. విస్తరణకు అనువుగా వాతావరణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. తెలంగాణలోకి నేడు(సోమవారం) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం సాయంత్రానికి రాయలసీమలోకి నైరుతి పవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో కర్ణాటక పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, చిత్తూరు. తిరుపతి వైపుగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.

దీని ప్రభావంతో ఆదివారం రాత్రి అక్కడక్కడా భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గోవా, కొంకణ్‌, కర్ణాటక ప్రాంతాల్లో రుతుపవనాల ఆగమనం జరిగి శనివారంనాటికే విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాల రాకకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని, అవి మరింత విస్తరించేందుకు తాజా వాతావరణ పరిస్థితులు ఉపకరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

పశ్చిమ భారత ప్రాంతాలనుంచి తెలంగాణవైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, ఆదివారం సాయంత్రానికి కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గలేదు. కొన్నిచోట్ల వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడ్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement