Saturday, April 20, 2024

తిరుపతి ఉప ఎన్నిక కు ఓటింగ్ ప్రారంభం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్… రాత్రి 7 గంటల వరకూ సాగనుంది. కరోనా నేపథ్యంలో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున… మొత్తం 2 వేల 470 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు… మే రెండో తేదీన జరగనుంది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట సెగ్మెంట్లలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

ఉపఎన్నిక వైసీపీ నుంచి గురుమూర్తి, టిడిపి నుంచి పనబాక లక్ష్మి, బిజెపి నుండి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్ బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్‌…. రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఎండలు తీవ్రంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీరు సహా ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా వేయనున్నట్లు తెలిపారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్‌ సందర్భంగా… ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 13 వేల 827 మంది రాష్ట్ర పోలీసులు, 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు బందోబస్తులో ఉన్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 877 పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల్ని మోహరించారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 466 పోలింగ్‌ కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement