Thursday, March 28, 2024

కొనుగోలు కేంద్రాలు బ్రహ్మండంగా పనిచేస్తున్నాయి: మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్రలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు బ్రహ్మండంగా పనిచేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఏ రైతు ఇబ్బందులు ఉన్నాయని ఫిర్యాదు చేయడం లేదన్నారు. అనవసర దుష్ప్రచారాలతో రైతులను గందరగోళ పర్చొదని కోరారు. కరీంనగర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 352 కొనుగోలు కేంద్రాలు అవసరమనే అంచనా వేసినట్టు చెప్పారు. 180 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. 2,46,000 వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 3,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సెకరించే అంచనా వేశామన్నారు. 1682 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయని దిగుబడి బ్రహ్మండంగా వచ్చిందన్నారు. ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెపుతూ సంతోషంగా ఉన్నారన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైతులు ఎవరూ దళారులకు, మధ్యవర్తులకు అమ్ముకోవద్దని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో 1960 కనీస మద్దతు ధర కేటాయించి కొనుగోళ్లు చేస్తున్నామని, రైతులకు అండగా ప్రభుత్వం ఉందని పునరుధ్ఘాటించారు.

గన్నీ బ్యాగులు లేవని, కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదంటూ విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ఇవన్నీ అవాస్తవాలన్నారు. ఈ యాసంగిలో 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టినప్పుడే 1 కోటి 60 లక్షల బాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొత్తం సివిల్ సప్లైస్ యంత్రాంగం త్వరతిగతిన స్పందించి మిల్లర్లు, రేషన్ డీలర్ల నుండి పాత గన్నీలు సేకరించామన్నారు. అంచనాకు మించి తక్కవ సమయంలోనే గన్నీలు సేకరించిన విషయాన్ని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు 3 కోట్ల గన్నీలు అవసరముంటే నిన్నటి వరకే 6 కోట్ల 85 లక్షల గన్నీలు సేకరించి సిద్దంగా ఉంచామని మంత్రి గంగుల వివరించారు. ఇందులో కొత్తవి 57లక్షలు అందుబాటులో ఉండగా మరో 8 కోట్లు కొత్త గన్నీలు అవసరమన్నారు, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. అన్ని జిల్లాలకు అవసరమైన గన్నీలు పంపామని తెలిపారు. దుష్రచారాలు నమ్మెద్దని రైతులకు విజ్ణప్తి చేసారు.

చల్లగున్న రైతన్నను చూసి ఓర్వకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్.. మోకాలడ్డుతూ కొనవల్సిన బాధ్యతల్నుండి చేతులెత్తేసిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేకపోతే గతంలో మాదిరి రైతు ఆత్మహత్యలకు దారి తీసేదన్నారు. మానవత్వం గల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఖర్చైనా భరించి రైతుకు అండగా ఉండి చివరి గింజ వరకూ కొనాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి గంగుల గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement