Saturday, April 20, 2024

Telangana: జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ రద్దు.. రాత ప‌రీక్ష‌లో అక్ర‌మాలే కార‌ణం!

జూనియ‌ర్ లైన్‌మెన్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ఆపేస్తున్న‌ట్టు ద‌క్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సీఎండీ జి. ర‌ఘుమారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన మ‌రో నోటిఫికేష‌న్ త్వ‌ర‌లోనే ఇస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ మేర‌కు దానికి సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న ఇవ్వాల (గురువారం) మీడియాకు వివ‌రించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17న రాత పరీక్ష జ‌రిగింది. ఈ రాత పరీక్షకు పెద్ద‌ సంఖ్యలో అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ పరీక్షలో రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, ఇతరులు డబ్బులు వసూలుచేసి కొంతమంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

దీంతో హైదరాబాద్, రాచకొండ పోలీస్ శాఖవారు విచారణ చేపట్టారు. 181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసుల విచారణలో వెల్ల‌డైంది. మరింత మంది అభ్యర్థులకు కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉంద‌ని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాత పరీక్షలో జరిగిన అక్రమాలపై కొంతమంది అభ్యర్థులు కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, పరీక్షను రద్దు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. కాగా, ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ వివిధ విద్యుత్ సంస్థల ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది.

జులై 17న నిర్వహించిన రాత పరీక్షలో బయటపడ్డ అక్రమాలు, ప‌లువురు అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకుంటూ, సంస్థ పరిధిలో 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన‌ నోటిఫికేషన్ నెంబర్ 03 /2022, తేదీ 09.05.2022 ను రద్దు చేస్తున్న‌ట్టు సంస్థ సీఎండీ వెల్ల‌డించారు. ఈ 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని రఘుమా రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement