Friday, March 29, 2024

Miracle: వ్యాక్సిన్ చేసిన అద్భుతం.. పక్షవాతం వచ్చిన వ్యక్తికి నయం.. గొంతు నుంచి మళ్లీ మాటలు..

ఇత‌ను నిజంగా అదృష్ట‌వంతుడే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. చాలామంది కరోనా వైరస్ తో శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా ఇబ్బందుకు ఎదుర్కొంటుంటే.. ఈ వ్యక్తి మాత్రం ప‌క్ష‌వాతం నుంచి కోలుకున్నాడు. నాలుగేండ్ల‌ నుంచి పడుతున్న ఆరోగ్య బాధల నుంచి విముక్తి పొందాడు. దేశంలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ డ్రైవ్ మొదలు పెట్టారు అధికారులు. ఇప్పటికి దేశ వ్యాప్తంగా 150 కోట్ల డోసులకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. అలా టీకాలు వేస్తున్న క్ర‌మంలో ఓ వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ అద్భుతంగా ప‌నిచేసింది. కొన్నేళ్లుగా పక్షవాతంలో మంచానికే పరిమితమైన ఆ వ్యక్తిలో కదలికలు తెప్పించింది కరోనా వ్యాక్సిన్. అంతేకాదు మూగబోయిన ఆ గొంతు మళ్ళీ మాట్లాడం మొదలు పెట్టింది. ఇది చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఈ అద్భుతం జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో జ‌రిగింది.

ఓ మీడియా సంస్థ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని పెతర్వార్ మండలం సల్గాడి గ్రామంలో దులార్ చంద్ (55) నాలుగేండ్ల క్రితం జ‌రిగిన యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు, వెన్నెముక‌కు ఆపరేషన్ జ‌రిగింది. అతి కష్టం మీద డాక్ట‌ర్లు ప్రాణాలను కాపాడారు. అయితే అప్పటి నుంచి దులార్ చంద్ శరీరంలో అవయవాలు పనిచేయడం మానేశాయి. మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి మంచం మీదనించి క‌దిలిందే లేదు. అయితే కరోనా నివారణ కోసం చేప‌ట్టిన‌ వ్యాక్సినేష‌న్‌లో భాగంగా దులార్ చంద్ కు టీకా వేయించారు కుటుంబ సభ్యులు.

జనవరి 4న అంగన్‌‌వాడీ కార్యకర్తలు దులార్ చంద్ ఇంటికి వెళ్లి కోవిషీల్ట్ టీకాను ఇచ్చారు. అయితే ఇక్కడే మ్యాజిక్ జరిగింది. వ్యాక్సిన్ అతని పాలిట సంజీవని అయ్యింది. డాక్టర్లకు కూడా అర్ధం కాని విధంగా టీకా దులార్‌చంద్ కు కొత్త జీవితం ప్రసాదించింది. నెక్స్ట్ డే నుంచి అత‌ను మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు శరీరంలోని అవయవాలలో కదలికలు వచ్చాయి. దీంతో దులార్‌చంద్ ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ నిజంగా అద్భుతం చేసిందని గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమిత్రా దేవి కూడా సంతోషంగా చెబుతున్నారు. దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని డాక్ట‌ర్లు చెప్పారు. ఇది ఎవరికీ ఊహకు అందని అద్భుతమని సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement