Tuesday, April 23, 2024

TS | మళ్లీ తెరపైకి హైదరాబాద్‌ రెండో రాజధాని అంశం.. ప్రకాష్‌ అంబేద్క‌ర్‌ ప్రస్తావనతో దేశవ్యాప్తంగా చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను మార్చాలన్న అంశం మరోమారు తెరపైకి వచ్చింది. దేశ సరిహద్దుల్లో తరచుగా ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్న అంశంపై యావద్దేశం దృష్టి సారించింది. భారత రాజ్యాంగ నిర్మాత , తన తాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చూడాలని అనుకున్నారని, 60 ఏళ్లయినా ఈ ప్రతిపాదన అమలులోకి రాలేదని అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం చేసిన ప్రకటన సంచలనానికి దారి తీసింది. ఈ ప్రతిపాదన మరోమారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ అంశాన్ని ఎవరో సాధారణ వ్యక్తి ప్రతిపాదిస్తే పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు కానీ, అంబేడ్కర్‌ మనవడే చెప్పడం తో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆనాడు అంబేడ్కర్‌ హైదరాబాద్‌ను పలుమార్లు సందర్శించిన సందర్భంగా ఇక్కడి వాతావరణం అయన్ను కట్టిపడేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర స్థానంలో ఉండడంతో రెండోరాజధానిగా చేయాలని తన పుస్తకంలో కూడా రాశారని ప్రకాష్‌ అంబేడ్కర్‌ వేలాదిమంది ప్రజల ప్రజలు హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. హైదరాబాద్‌ రెండోరాజధానిగా మారాలని కోరుకుంటున్నానని కూడా ఆయన అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా టాంక్‌ బండ్‌ వద్ద జరిగిన అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయనీవిషయం ప్రస్తావించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ లేదా సికింద్రాబాద్‌ను రెండో రాజధానిగా మార్చాలనే ప్రతిపాదన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో కూడా వచ్చింది. తొలి ప్రధాని పండిట్‌ జవహల్‌ లాల్‌ నెహ్రూూ వద్ద ఈ విషయం చర్చకు వచ్చింది. రెండో రాజధానిగా మార్చేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఢిల్లిdతో పోలిస్తే భద్రతాపరంగా దేశానికే రక్షణ కవచంగా హైదరాబాద్‌ ఉంటుందని ఆనాడే గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లిd మహానగరం పాకిస్తాన్‌ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా చైనా సరిహద్దుకు కేవలం 500 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో రాజధానితో పాటు రెండో రాజధాని కూడా ఉంటే బాగుంటుందనేది జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆనాడే అనుకున్నారు.

1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కాకపోవడంతో నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు అప్పటి హోంశాఖ మంత్రి సర్ధార్‌ పటేల్‌ నిజాంపాలకులపై సైనిక చర్యకు దిగటంతో హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనమైన సంగతి ఒక చరిత్ర. సైనిక చర్య అనంతరం దేశానికి రెండో రాజధాని అవసరాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతటితో ఆగకుండా ఆనాటి కేంద్ర మైన్స్‌ , పవర్‌ అండ్‌ వర్క్‌ ్స శాఖ మంత్రి విఎన్‌ గాడ్గిల్‌ను మహారాష్ట్రలోని నాసిక్‌, హైదరాబాద్‌ స్టేట్‌లోని సికింద్రాబాద్‌ను సందర్శించాలని పంపించింది. నాసిక్‌ కంటె కూడా సికింద్రాబాద్‌ అయితేనే అనువైన ప్రదేశమని గాడ్గిల్‌ కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి.

- Advertisement -

ఆ తర్వాత పట్టించుకునే వారు లేనందున ఈ అంశం మూలకు పడింది. ఆ తర్వాత 1950 లో అంబేడ్కర్‌ రెండో రాజధాని అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. అందుకు హైదరాబాద్‌ అయితేనే బాగుంటుందని కూడా సూచించారు. అంతేగాక అదే సంవత్సరం తాను రాసిన థాట్స్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్‌ స్టేట్స్‌’ అనే పుస్తకంలో కూడా హై దరాబాద్‌ నగరాన్ని రెండో రాజధానిగా చేస్తే ఉమ్మడి ప్రయోజనాలుఉంటాయని అంబేడ్కర్‌ ప్రస్తావించారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ , చైనా సరిహద్దులకు హైదరాబాద్‌ దూరంగా ఉంది. దీనివల్ల భద్రతా పరంగా అనువైన ప్రాంతం.., రాజధానిగా అభేధ్యమైన కోటగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం అన్ని సీజన్‌లలో సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక భిన్నసంస్కృతులకు నిలయమని, తెలుగు, ఉర్ధూ, హిందీ భాషలు మాట్లాడే వారు ఉన్నందున హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని ఆయన ప్రతిపాదించారు.

అంబేడ్కర్‌ ఈ ప్రస్తావన చేసిన చాలా కాలం తర్వాత 2013 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో కూడా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రా ప్రాంతం నుంచి డిమాండ్లు వచ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే సహించే ప్రసక్తిలేదని తెలంగాణ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. రెండు ప్రాంతాలు భిన్నస్వరాలు వినిపించడంతో కేంద్రంలో ఉన్న నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనబెట్టింది. మళ్లి శుక్రవారం ప్రకాష్‌ అంబేడ్కర్‌ హైదరాబాద్‌ రెండో రాజధాని అంశాన్ని ప్రతిపాదించడంతో మరోమారు చర్చకు వచ్చింది.

కేంద్రంలోఅధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బీజేపీ ) కూడా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా మార్చడంపై అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చొరవ తీసుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించకుండా తెలంగాణలో భాగంగా రెండో రాజధానిగా ప్రకటిస్తే పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద మున్ముందు ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో పాటు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement