Friday, May 27, 2022

పోడు భూములకు ప‌ట్టాల విషయంలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ దే ఫైనల్ డెసిషన్..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: పోడు భూముల నిర్ధారణలో అటవీ శాఖదే కీలకపాత్ర కానుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం ఒక్క అంగుళం అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోడు భూములకు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని ఈనెల 8 నుంచి ప్రారంభించింది. ఇప్పటికే 2005కు ముందు నుంచి సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతరుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిలో వ్యక్తిగత హక్కు ఫారం ఏ, ఉమ్మడి హక్కు ఫారం బి పేరుతో దరఖాస్తులను తీసుకున్నారు. వాస్తవానికి ఈనెల 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు పోడు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయా జిల్లాల్లో ఈనెల 18, 20వ తేదీలతోనే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ముగించారు. అనుమతులు వచ్చేలోగా మండలాలు, గ్రామ పంచాయతీలు, ఆవాసాల వారీగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.

అలాగే క్షేత్రస్థాయి పరిశీలనలో ల్యాండ్‌ సర్వేయర్లు, రెవిన్యూ, అటవీ, పంచాయతీరాజ్‌, గిరిజన సంబంధిత శాఖలకు చెందిన సిబ్బందికి ప్రాథమికంగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం, భూమి ఆక్రమణలపై అవగాహన కల్పిస్తున్నారు. నిజమైన పోడు సాగుదారులను గుర్తించే పనిలో భాగంగా జీపీఎస్‌ ద్వారా పోడు భూములను నిర్ధారించనున్నారు. ఇప్పటి వరకు కుమరంభీం, అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో 45 వేల పోడు దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6520 దరఖాస్తులు, వికారాబాద్‌ జిల్లాలో 600 దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లాలో 1074, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 80,938 దరఖాస్తులు, ఖమ్మం జిల్లాలో 16,781 దరఖాస్తులు, జగిత్యాల జిల్లాలో 4,724, పెద్దపల్లి జిల్లాలో 4,614 దరఖాస్తులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,939 దరఖాస్తులు, అదిలాబాద్‌ జిల్లాలో 16,661 దరఖాస్తులు గిరిజన, గిరిజనేతరుల నుంచి అందాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement