Saturday, April 20, 2024

కమాండ్‌ కంట్రోల్‌ను ప్రశంసించిన కేంద్రం .. మంత్రి కారుమూరు

న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ: ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలను కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బుధవారం జరిగిన అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రుల సదస్సులో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చామని వివరించారు. ధాన్యం తూకం పట్టడం నుంచి మొదలుపెట్టి, రైస్‌ మిల్లుకు వెళ్లడం, బియ్యం పట్టడం, గోదాంకు వెళ్లడం, గోదాం నుంచి రేషన్‌ షాపులకు చేరడం వరకు జియో ట్యాగింగ్‌ ద్వారా పూర్తిస్థాయిలో మానిటరింగ్‌ ఉండేలా అభివృద్ధి చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందించారని మంత్రి కారుమూరు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా బియ్యం రీ స్ఖైక్లింగ్‌ జరగకుండా చూస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా కేంద్రం నుంచి 2012-2018 మధ్యకాలంలో రావాల్సిన బకాయి నిధుల గురించి అడిగానని, రూ. 1702 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కావాలని కేరళ రాష్ట్రం కోరిందని, ఆ మేరకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేరళకు ఇస్తామని చెప్పారు. జయబొండాలు అనే రకం బాయిల్డ్‌ రైస్‌ ప్రస్తుతం కర్ణాటక నుంచి కేరళకు వెళ్తోందని, అయితే ఆంధ్రప్రదేశ్‌ బియ్యానికి ఉన్న రుచి ఆ బియ్యానికి లేదని కేరళ రాష్ట్రం చెబుతోందని మంత్రి వివరించారు.

వచ్చే ఖరీఫ్‌ సీజన్ లో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌.సీ.ఐ)కు ఇస్తామని అన్నారు. పోషకవిలువలతో కూడిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేందుకు రైస్‌ మిల్లర్ల తో సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం కాకినాడలో ఒక మిల్లు మాత్రమే ఈ బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోందని మంత్రి కారుమూరు నాగేశ్వర రావు వెల్లడించారు. ఏపీలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, ఆదివాసీలకు అంత్యోదయ కార్యక్రమం కింద లక్ష రేషన్‌ కార్డులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి చెప్పారు. అలాగే రాష్ట్రానికి కావాల్సిన జొన్నలు, రాగుల గురించి అడిగామని, కర్ణాటక రాష్ట్రం అందజేస్తుందని చెప్పారు. రేషన్‌ కార్డు కల్గినవారికి రాగులు, జొన్నలు, గోధుమ పిండి ఇస్తే ఆ మేరకు బియ్యం పరిమాణం తగ్గిస్తామమని చెప్పారు. మరోవైపు రైతుల దగ్గర సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరుపుతున్నామని, కేంద్రం నుంచి సకాలంలో నిధులు అందడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడలేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో పలువురి రేషన్‌ కార్డులను తొలగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. అర్హులందరికీ కార్డులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎవరైతే ఆదాయపు పన్ను కడుతున్నారో, ఎవరికైతే 3 ఎకరాల కంటే ఎక్కువ పంట భూములున్నాయో.. అలాంటివారివే తొలగించామని వివరించారు. తమకు రేషన్‌ కార్డులు తగ్గించాలన్న ఆలోచనే లేదని, అర్హత కల్గిన ఎవరు దరఖాస్తు చేసుకున్నా రేషన్‌ కార్డు వెంటనే మంజూరు చేస్తున్నామని మంత్రి కారుమూరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement