Friday, March 29, 2024

ఇండ్ల ధరలకు రెక్కలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : దేశంలోని పలు మెట్రో నగరాల్లో నివాసగృహాల ధరలు కొవిడ్‌ విజృంభణతో తగ్గుముఖం పట్టినప్పటికీ, విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్‌ మహా నగరంలో మాత్రం పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రియల్‌ రంగాభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగాభివృద్ధికి చేస్తున్న కృషితో పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌ను అనువైన ప్రాంతంగా భావిస్తుండటంతో పాటు, ఐటీ, ఫార్మారంగాల్లోనూ గ్రేటర్‌కు పెద్దపీట వేస్తుండటంతో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఖ్యాతినార్జించింది. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ప్రవేశ పెట్టిన టీఎస్‌బీపాస్‌తో కూడా ఇళ్ల నిర్మాణ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. తద్వారా నగరంలో స్థిర పెట్టుబడిగా ఇళ్ల కొనుగోలును ఎంచుకొని పెట్టుబడి పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇళ్ల విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో ఇళ్ల కొనుగోళ్లు, అమ్మకాలతో పాటు రిజిస్ట్రే షన్లు సైతం పుంజుకున్నాయి.

ధరల పెరుగుదలపై టైగర్‌ డాట్‌కామ్‌ నివేదిక..

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అధ్యయన సంస్థ ప్రాపర్టీ టైగర్‌ డాట్‌కామ్‌ తాజా నివేదికలో ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ధరలున్నట్లు తెలిపింది. గత బుధవారం విడుదలైన ఈ నివేదికలో హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 6,556 ఇళ్ల విక్రయాలు జరిగినట్లు వెల్లడించింది. అలాగే 14,572 కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక నగరంలో ఆస్తి విలువ వార్షికంగా 7శాతం వృద్ధి చెందిందని ప్రాపర్టీ టైగర్‌ తన నివేదికలో తెలిపింది. ఈ క్రమంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని టైగర్‌ డాట్‌కామ్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం చదరపు అడుగుకు సరాసరి ధర రూ.6000 నుంచి 6200 మధ్య పలుకుతుందని తెలుస్తుండగా, హైదరాబాద్‌ కేంద్రంగా భారీ, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ధరలు పరుగులు పెడుతున్నాయని ప్రాపర్టీ టైగర్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో వికాస్‌ వాద్వాన్‌ తెలిపారు.

పెరిగిన ధరలతో సామాన్యుల ఆందోళన..

సామాన్య, మధ్యతరగతి వర్గాలు ప్రస్తుతం పెరిగిన ఇళ్ల ధరలతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ఇళ్ల ధరలతో కొనుగోళ్లకు వెనుకంజ వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుండగా, ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు మినహా మిగతా వర్గాలు ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. బ్యాంక్‌లోన్లు, పెరిగిన ధరలతో తమ సొంతింటి కల ఎప్పటికి నెరవేరుతుందోనన్న ఆందోళన సామాన్య, ఎగువ, మధ్య తరగతి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికీ పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు, కరోనా కలకలంతో సేవింగ్స్‌ మొత్తం ఖాళీ అయిన దరిమిలా జనం సొంతింటి కొనుగోలుకు వెనుకంజ వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -

నగరాల వారీగా ఇళ్ల ధరలు (రూ.లలో)

ముంబై : 9,800 – 10,000
హైదరాబాద్‌ : 6000 – 6200
చెన్నై : 5,700 – 5,900
బెంగళూరు : 5,600 – 5,800
పూణే : 5,400 – 5,600
ఢిల్లి ఎన్‌సీఆర్ : 4,500 – 4,700
కోల్‌కతా : 4,300 – 4,500
అహ్మదాబాద్ : 3,500 – 3,700

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement