Thursday, April 25, 2024

ఈదురు గాలుల‌తో ఇగం ప‌ట్టిన తెలంగాణ‌.. ఏపీలోనూ పెరిగిన చ‌లి..

చలి గాలుల‌తో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలు గ‌జ‌గ‌జ‌ వణికిపోతున్నాయి. దట్టమైన పొగ మంచు.. బలమైన చలిగాలుల్లో జనాలు ఇగం ప‌డుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేసింది. సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. వాతావరణ శాఖాధికారులు మాట్లాడుతూ… రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత మ‌రింత పెరుగుతోందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్ట‌ర్లు కూడా సూచనలు చేశారు. మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ మన్యం చలికి వణికిపోతోంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచులో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తెలంగాణలో చలిగాలులు..
కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు బలంగా చలిగాలులు వీస్తున్నాయన్నారు. సాయంత్రం 6 గంటల నుండే శీతల గాలులు వీస్తున్నాయని, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement